ధాన్యం అధరహో

21 May, 2017 00:56 IST|Sakshi
తాడేపల్లిగూడెం : బొండాలు రకం «ధాన్యం నిల్వచేసిన రైతుల దశ తిరిగింది. 75 కిలోల బస్తా ధర రూ.1,200 నుంచి అమాంతం రూ.1,450కి చేరింది. కేరళకు ఎగుమతులు ఊపందుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇతర రకాల ధాన్యం ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. బస్తా రూ.1,100 వరకు పలికిన ఇతర రకాల ధర రూ.75 నుంచి రూ.100 వరకు పెరిగింది.
 
మూడేళ్ల తరువాత డిమాండ్‌
బొండాలు ధాన్యం ధరలు మూడేళ్ల క్రితం వరకు ఒక ఊపు ఊపాయి. ఈ ధాన్యం కేరళ రాష్ట్రానికి అ«ధికంగా ఎగుమతి అవుతుంది. అక్కడి వ్యాపారులు ఇక్కడి ఎగుమతిదారులకు కోట్లాది రూపాయలు బకాయి పడటంతో ఆ తరువాత ఎగుమతులు నిలిచిపోయాయి. అక్కడి వ్యాపారులతో జరిపిన చర్చల నేపథ్యంలో తిరిగి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉప్పుడు బియ్యాన్ని అధికంగా వినియోగించే కేరళలో బొండాలు ధాన్యానికి డిమాండ్‌ ఎక్కువ. ఎగుమతులు ఊపందుకోవడం ధరల పెరుగుదలకు దోహదం చేసింది. ఏ గ్రామంలో అయినా రైతు వద్ద ఈ ధాన్యం ఉందని తెలిస్తే వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. దీంతో కేవలం రెండు వారాల వ్యవధిలో 75 కిలోల బస్తాకు ఏకంగా రూ.250 ధర పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. మన జిల్లాలో బొండాలు రకం ధాన్యాన్ని 10 శాతం విస్తీర్ణంలో మాత్రమే పండిస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జిల్లాలోని నిడదవోలు పరిసర ప్రాంతాలతోపాటు పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రు వంటి గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు దీనిని సాగు చేస్తున్నారు. 
 
ఇతర రకాల ధరలు ఇలా
మిగిలిన ధాన్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. కొత్తగా సంకరపర్చిన రకాలకు డిమాండ్‌ బాగానే ఉంది. 1010 రకం ధాన్యం 75 కిలోల బస్తా రూ.1,210, 1121 రకం బస్తా రూ.1,180, 1156 రకం రూ.1,180 చొప్పున పలుకుతున్నాయి. 1010 రకం ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తున్నా ధాన్యం ధర  ఆకాశంలో ఉండటంతో బియ్యం ఎగుమతులకు వ్యాపారులు, మిల్లర్లు ఆసక్తి కనపర్చడం లేదు. ధాన్యంపైనా దృష్టి సారించారు. ధాన్యం ఉప ఉత్పత్తుల ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. తవుడు క్వింటాల్‌ రూ.1,580, నూకలు రూ.1,700 పలుకుతున్నాయి. 
 
మరిన్ని వార్తలు