జై దుర్గాభవానీ..

16 Feb, 2018 10:46 IST|Sakshi

కనుల పండువగా అమ్మవారి రథోత్సవం

ప్రారంభించిన  డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

మూడో రోజు కిటకిటలాడిన ఏడుపాయల

బోనాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల జాతరలో చివరి రోజైన గురువారం రాత్రి జై దుర్గాభవానీ నామ స్మరణతో అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఏడుపాయల పాలకవర్గ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సాయిరెడ్డిలు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథంగోలి వద్ద ఉన్న రథాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలు, మెరుపు కాగితాలు, పూలదండలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం రథంపై పలువురు దేవతల చిత్ర పటాలను అలంకరించి, మధ్యలో దుర్గమ్మతల్లి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రథం ముందు పట్టు పరిచి 18 కులాల పనిబాటలవారు తమ తమ వృత్తులు, సాంప్రదాయాలకనుగుణంగా మంత్రాలను పటించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు వందలాది మంది భక్తులు రథాన్ని  తాళ్లను పట్టి జై దుర్గాభవాని అంటూ నినాదాలు చేస్తూ రథాన్న లాగారు.

భారీ బందోబస్తు..
రథం ముందు డప్పుచప్పుళ్ల కనుగుణంగా యువకులు నృత్యాలు చేస్తుండగా రథోత్సవ ఊరేగింపు ముందుకు సాగింది. దారి పొడుశున వేలాది భక్తులు బండరాళ్లపై నిలబడి దుర్గమాతకు జై అంటూ చేసిన నినాదాలతో ఏడుపాయల కొండకోనలు మారుమ్రోగాయి. రాజగోపురం వరకు అత్యంత వైభవంగా రథోత్సవం కొనసాగింది.  ఎస్పీ చందనాదీప్తి, అదనపు ఎస్పీ నాగరాజుల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పాలకవర్గ డైరెక్టర్లు శివాజి, ఇతర శాఖల అధికారులు తమ తమ సేవలందించారు.

పలువురు భక్తులు విందులతో..
జాతరలో 3వ రోజు గురువారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. తొగిట పిఠాధిపతి మాధవానంద స్వామి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. మంజీరా నదిలో స్నానాలు చేసిన భక్తులు క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా పలువురు భక్తులు విందులు ఏర్పాటు చేసుకుని  ఏడుపాయల్లోని పచ్చని చెట్ల నీడన ఆనందంగా గడిపారు. 

మరిన్ని వార్తలు