పునాదుల్లోనే ప్రగతి

3 Jul, 2017 03:53 IST|Sakshi
పునాదుల్లోనే ప్రగతి

పంచాయతీ భవనాలకు గ్రహణం
82 మంజూరు కాగా 15 పూర్తి
నిర్మాణంలో తీవ్ర జాప్యం
అధికారుల పర్యవేక్షణ లోపంతోనే..

మంజూరైన నిధులు : రూ.9.84కోట్లు
ఒక్కో భవన నిర్మాణానికి : రూ.12కోట్లు

ఆదిలాబాద్‌: జిల్లాలో పలు గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. భవనాలతో గ్రామాలకు కొత్తకళ వస్తుందని ఆశించిన పంచాయతీ సభ్యులు, గ్రామస్తులకు నిరాశే మిగులుతోంది. ప్రతీరోజు కళ్లెదుటే పిల్లర్లు, మొండిగోడలతో అసంపూర్తి భవనాలు కనిపిస్తుండడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేయించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది ఈజీఎస్‌ కింద జిల్లాకు 82గ్రామపంచాయతీ నూతన భవనాలు మంజూరు కాగా రూ.9.84 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. అయినా పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు.

కొనసా.. గుతున్న పనులు..
జిల్లాలో గతేడాది మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామపంచాయతీలుండగా 82 గ్రామపంచాయతీలకు గతేడాది ప్రభుత్వం నూతన –భవనాలు మంజూరు చేసింది. 82 భవనాల్లో 15 పంచాయతీ భవనాలు మాత్రమే పూర్తి కాగా ఇంకా 57 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పది భవనాల పనులు ఇంకా ప్రారంభించకపోవడం శోచనీయం. జిల్లాలో చాలా చోట్ల బేస్మెంట్, పిల్లర్లు, రూఫ్‌లెవల్‌లోనే భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి.

 అయితే కాంట్రాక్టర్‌లకు సరిగా బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టకుండా చేతులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ పనులు పూర్తికావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయకుంటే ఇప్పటికే పనులు పూర్తి చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటే భవన నిర్మాణాలు పూర్తవుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

కార్యక్రమాలకు ఇబ్బందులే..
పంచాయతీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇటు పంచాయతీ భవనాలు లేక, అటు సరైన సౌకర్యాలు లేక ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలు, ఇతర కార్యకలాపాలు చెట్ల కింద, ఇతర ప్రైవేట్‌ స్థలాల్లో నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమ కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. ప్రతీనెల పం పిణీ చేసే ఆసరా పింఛన్‌లు కూడా లబ్ధిదారులకు చెట్ల  కింద, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మి స్తున్న పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేసి సరైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు