శనివారపుపేట కార్యదర్శి సస్పెన్షన్‌

13 Sep, 2016 01:30 IST|Sakshi
గ్రామం వదిలి వెళ్లకూడదని కలెక్టర్‌ ఆదేశాలు
శనివారపుపేట (ఏలూరు రూరల్‌): ఏలూరు మండలం శనివారపుపేట గ్రామ కార్యదర్శి నిట్టా రవికిషోర్‌ను కలెక్టర్‌ కె.భాస్కర్‌ సస్పెండ్‌ చేశారు. గ్రామం వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను ఎంపీడీవో ఎన్‌.ప్రకాశరావు తన సిబ్బంది ద్వారా కార్యదర్శి రవికిషోర్‌కు అందజేశారు. సర్వే విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు గతనెల 17న రవికిషోర్‌పై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసిన కార్యదర్శి ఏకబిగిన పనిచేసి సర్వే పూర్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ఆదేశాలు అందుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయ పైరవీలు నడిపారు. ఫలితం లేకపోవడంతో తనను సస్పెన్షన్‌ చేసే అధికారం ఎంపీడీవోకు లేదని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్‌ కార్యదర్శి అప్పీల్‌ను కొట్టేసింది. గత్యంతరం లేని సమయంలో రవికిషోర్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నుంచి ఎంపీడీవో ఆదేశాలు చెల్లవంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారని తెలిసింది. ఈ ఉత్తర్వుల కాపీను గత శనివారం ఎంపీడీవోకు చూపించి తనకు బాధ్యతలు అప్పగించాలని రవికిషోర్‌ కోరారు. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్‌ భాస్కర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణం కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  
 
మరిన్ని వార్తలు