పాణ్యమే ముద్దు!

10 Sep, 2016 00:35 IST|Sakshi
పాణ్యమే ముద్దు!
– కార్పొరేషన్‌ ఎన్నికలు వేదికగా తెరపైకి..
– బల నిరూపణకు ఏర్పాట్లు
– అనుచర వర్గానికి సీట్లు దక్కించుకునే ప్రయత్నాలు
– పట్టు నిలుపుకునేందుకు తాజా ఇన్‌చార్జి మల్లగుల్లాలు
– ఆసక్తికరంగా మాజీ మంత్రుల మధ్య వార్‌
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అందని ద్రాక్ష పుల్లన.. కాదు కాదు తీపే అంటున్నారు ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి. పాణ్యం నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే అది నిజమేననిపించక మానదు. తాజాగా కార్పొరేషన్‌ ఎన్నికలు వేదికగా పాణ్యం నియోజకవర్గ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సదరు నేత ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆయన ప్రయత్నాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అధికార పార్టీలో మళ్లీ పాణ్యం వేదికగా రాజకీయం వేడెక్కుతోంది.
 
మొదటి నుంచీ ప్రయత్నాలు
వాస్తవానికి ఎన్నికల ముందు ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ సదరు నేత ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడ్డారు. అటు ఎమ్మెల్సీ కానీ.. ఇటు రాజ్యసభ సభ్యత్వం కానీ దక్కలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక సీటును ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన సదరు నేతకు సొంత కుటుంబం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ వారసుడు తన కుమారుడేనని స్వయంగా ముఖ్యనేత ప్రకటించారు. దీంతో పత్తికొండ సీటు ఖాళీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పాణ్యంపై దష్టి సారించారు. ఇందుకోసం తన అనుచరులతో మంతనాలు జరిపి పార్టీలు కూడా చేసుకున్నారు. అయితే, అధిష్టానం నుంచి మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో కొంతకాలంగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. తాజాగా కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తిరిగి హడావుడి చేద్దామని ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.
 
రెండుగా చీలిన పార్టీ...
పాణ్యం నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇరువురు మాజీ మంత్రుల నడుమ కేడర్‌ నలిగిపోతోంది. తన అనుచర వర్గంతో ఇప్పటికీ ముఖ్యనేత సోదరుడు, మాజీ మంత్రి బలమైన నేతగానే ఉన్నారు. వీరి అండతోనే పాణ్యంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన బలం చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు ఇప్పించుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే పాణ్యం నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు