పాపం.. పండుటాకులు

12 Dec, 2016 15:01 IST|Sakshi
కొవ్వూరు : వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న పండుటాకులను కష్టాలు వెంటాడుతున్నాయి. పింఛను సొమ్ముల కోసం మూడు రోజుల నుంచి సహాయకులను వెంటబెట్టకుని.. చేతికర్ర సాయంతో కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూలో నిలబడి కౌంటర్‌ వద్దకు వెళితే.. మీ అకౌంట్‌లో సొమ్ము రాలేదనే సమాధానం వస్తోంది. వికలాంగులు, వితంతువుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జిల్లా వ్యాప్తంగా 3,38,153 మందికి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో సుమారు 2లవేల మంది ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. కొందరికి బ్యాం క్‌ ఖాతాలు లేకపోవడం.. ఖాతాలున్నా వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి కొన్ని ఖాతాలను సరిచేసినప్పటికీ ఇంకా 15,251 మందికి పింఛను సొమ్ము ఖాతాల్లో చేరలేదు.  
 
ప్రాంతాల వారీగా ఇలా..
ఉంగుటూరు మండలంలో గరిష్టంగా 784 మందికి, లింగపాలెం మండలంలో 674, పెదవేగి మండలంలో 599, పోడూరు మండలంలో 538, దేవరపల్లి మండలంలో 534 మందికి పింఛను సొమ్ములు వారి ఖాతాల్లో వేయలేదు. నరసాపురం, యలమంచిలి, ఇరగవరం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో ఒక్కోచోట 400 మందికి పైగా పింఛను సొమ్ము రాలేదు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో 1,909 మందికి సొమ్ము జమ కాలేదు. గరిష్టంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 771 మందికి, భీమవరం పట్టణంలో 244 మందికి, తణుకులో 246 మందికి పింఛన్లు జమ కాలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లో 654 మంది నేటికీ పింఛను సొమ్ముకు నోచుకోలేదు.
 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 2,300 రేష¯ŒS డీలర్లు, 350 మంది బ్యాంక్‌ బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా ఈనెల 6వ తేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని నిర్ణయించారు. లేవలేని స్థితిలో ఉన్న పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున బిజినెస్‌ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. 
 
మూడు రోజులుగా తిరుగుతున్నా..
పింఛను డబ్బు కోసం మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. అయినా సొమ్ము అందలేదు. బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసినట్టు చెప్పారు. బ్యాంకుకు వెళితే.. ఖాతాలో సొమ్ము పడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – సంపతి అమ్మన్న, తాళ్లపూడి
 
చాలా ఇబ్బంది పడుతున్నాం
గతంలో ప్రతినెలా 1వ తేదీన పింఛను సొమ్ము చేతికి ఇచ్చేవారు. ఈ నెల డబ్బులు ఎక్కడ ఇస్తారో తెలియక అయోమయంలో పడ్డాను. బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకుకు వెళితే అక్కడ ఖాళీ లేదు. నాకు ఏటీఎం కార్డు లేదు. పింఛను డబ్బు ఖాతాలో పడిందో లేదో తెలియడం లేదు. – అంకోలు శేషయ్య, వేగేశ్వరపురం
 
మరిన్ని వార్తలు