చిట్టితల్లికి ఎంత కష్టం?

21 Sep, 2016 23:39 IST|Sakshi
అవ్వా తాతలతో అంధురాలు బిందు

–క్యాన్సర్‌ ఉందని రెండు కళ్లు తొలగింపు
–అంధురాలని వదిలించుకున్న తల్లిదండ్రులు
–అవ్వాతాతలే అమ్మానాన్నల అవతారంలో సపర్యలు
–సాయంచేసే చేతులకోసం ఎదురుచూస్తున్న పండుటాకులు
క్యాన్సర్‌ సోకిందని అందాల రాశి బిందుకు వైద్యులు రెండు కళ్లు తొలగించారు.  సపర్యలు చేయలేక, ఆలనా పాలనా భారమై  ఏడాది కొడుకుతో తల్లిదండ్రులు చిన్నారిని అత్తమామల వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అవ్వా తాతలే  అమ్మా నాన్న లయ్యారు. కూలిచేస్తేగానీ పూట గడవని ఆ నిరుపేదలు మనవరాలి బాగోగుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదీ మదనపల్లె పట్టణం బసినికొండకు చెందిన ఓ నిరుపేద పండుటాకుల దీన గాథ..
మదనపల్లె టౌన్ః  మదనపల్లె పట్టణం బసినికొండకు చెందిన చాట్ల మోహన్, ప్రమీల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కుమార్తె బిందు(5)కు ఏడాది వయసులో కంటిలో కురుపు లాగా ఏర్పడడంతో  స్థానికంగా వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి కంటికి క్యాన్సర్‌ సోకినట్లు తేల్చారు. హైదరాబాద్‌ లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చూపిస్తే  ఆపరేషన్‌ చేయాలని, రెండు కళ్లు తీసేయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమన్నారు. రెండు కళ్లూ తొలగించేశారు. కుదుటపడిన బింధు తల్లిదండ్రులకు భారంగా మారింది. ఒంటరిగా వదలిపెట్టి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాల్సి వచ్చేది. ఆలనా పాలనా భారంగా మారింది. వేరే మార్గం లేక  బిడ్డను అత్త మామల వద్ద వదలిపెట్టి వెళ్లిపోయారు. ఐదేళ్లుగా వారి ఆచూకీS లేదు. పండుటాకులు ఉత్తమ్మ, నరసింహులు మనవరాలిని పోషించడానికి పడ రాని కష్టాలు పడుతున్నారు. ఉన్న ఇందిరమ్మ ఇంటిని అమ్మేసి బిందుకు ప్లాస్టిక్‌  కళ్లను అమర్చారు. మనవరాళి బాగోగుల కోసం వారు నరకయాతన అనుభవిస్తూ కుమిలిపోతున్నారు. దాతలు ఆర్థిక సాయం చేస్తే కంటికి రెప్పలా చూసుకుంటామంటున్నారు. ప్రభుత్వం స్పందించి సీఎం సహాయనిధి అందించాలని కోరుతున్నారు.  మనసున్న మా రాజులు ఆదుకోవాలని ఆపన్నుల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు 8374704482లో సంప్రదించవచ్చని,  లేదా దాతలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అకౌంటు నెంబర్‌ 564610110008409, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌.. బికెఐడి0005646కు నగదును జమచేయవచ్చని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు