బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం

14 Jul, 2016 12:29 IST|Sakshi
బుల్లితెర నటి శ్రీవాణి విలనిజం

పరిగి: రీల్ లైఫ్లోనే కాదు...రియల్ లైఫ్లోనూ బుల్లితెర నటి తన విలనిజాన్ని చూపించింది. సోదరుడి ఆస్తిపై కన్నేసిన ఆమె...వదినపై అమానుషంగా ప్రవర్తించింది. అన్నచనిపోవడంతో వదిన ఉంటున్న ఇల్లును జేసీబీతో కూల్చేసింది. ఆస్తి తమకే దక్కుతుందని అనుచరులతో వీరంగం సృష్టించింది. టీవీ సీరియల్ ఎపిసోడ్కు ఏమాత్రం తీసిపోలేదు. చంద్రముఖి సీరియల్ ఫేం శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు.

అయితే సోదరుడికి పిల్లలు లేకపోవడంతో  తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా వస్తుందంటూ శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో హల్చల్ చేశారు. వేరే వారిని ఆ స్థలాన్ని విక్రయించేందుకు యత్నించగా అందుకు బాబ్జీ భార్య అనూష అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీవాణి అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా, తన భర్త ఆదిత్యరెడ్డి సాయంతో ఆ ఇంటిని కూల్చివేసింది.

దీంతో అనూష పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి పోలీసులు శ్రీవాణిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అనూషపై శ్రీవాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై దాడికి యత్నించిందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరు కావాలని శ్రీవాణిని సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

మరోవైపు అనూషకు స్థానికులు బాసటగా నిలిచారు. అనూష భ‌ర్త చ‌నిపోయి బాధ‌లో ఉంటే వేధించ‌డమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇంటి స్థలం కోసం శ్రీవాణి యత్నించిందని, అయితే ఆ ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. చదవండి....(బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు)

మరిన్ని వార్తలు