రెచ్చిపోతున్న పరిటాల శ్రీరామ్

6 May, 2016 10:43 IST|Sakshi
రెచ్చిపోతున్న పరిటాల శ్రీరామ్

అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. అధికారం అండతో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హంద్రీ-నీవా జల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రామగిరి మండలం పోలేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకునేందుకు అల్లరిమూకలు బీహార్ తరహాలో రాళ్లు, కట్టెలు పట్టుకుని రోడ్లపై నిలబడి భయానక పరిస్థితులను తలపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి, ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రజల మద్దతు పెరుగుతుండడంతో..
జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీ-నీవా  నీటిని అక్రమంగా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి  కుట్ర పన్నారని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హంద్రీ-నీవా జల సాధన సమితి చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు  రామగిరి మండలం పోలేపల్లిలో కార్యక్రమం ఏర్పాటుకు ఇన్‌చార్జ్ సీఐ శ్రీధర్‌తో ముందురోజే ప్రకాష్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. అనుమతి ఉత్తర్వు సీఐ నుంచి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌కు వెళ్లింది. ఏం జరిగిందో ఏమో కానీ డీఎస్పీ అనుమతికి నిరాకరించారు. పరిటాల సునీత, శ్రీరామ్ ఒత్తిడి మేరకే పోలీసులు అనుమతి ఇవ్వలేదనే వాదన  వినిపిస్తోంది.
 
దారి పొడవునా రౌడీ, అల్లరిమూకలు
పోలేపల్లి సమావేశానికి పోలీసుల అనుమతి ఇవ్వలేదని తెలిసిన తర్వాత పరిటాల శ్రీరామ్ హల్‌చల్ చేసినట్లు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో  తమ అనుచరులుగా ఉన్న కొంతమంది రౌడీ మూకలను దింపి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తే అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్‌ఎస్ గేటు నుంచి వెంకటాపురం వెళ్లే దారిలో పాపిరెడ్డిపల్లి క్రాస్, పోలేపల్లి క్రాస్, చిగురుచెట్టు కింద, ఎగువపల్లి క్రాస్, సంజీవరాయుని రైస్‌మిల్, శ్రీహరికోట వద్ద గుంపులు గుంపులుగా జనం కట్టెలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు.  
 
 ఎస్పీని కలిసి ప్రకాష్‌రెడ్డి
ఈ క్రమంలో  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  గురువారం మధ్యాహ్నం ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చేస్తున్న దౌర్జన్యాలను వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 ప్రజల అండతో వెళ్లి తీరుతాం

శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని అధికారం దౌర్జన్యంతో అడ్డుకోవాలని మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవ ర్గ ప్రజలను పూర్తిగా విస్మరించారు. అన్నివర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అండతో రామగిరి పర్యటన కచ్చితంగా చేసి తీరుతాం. దీంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

మరిన్ని వార్తలు