రేపటిలోగా స్థలాన్ని ఖాళీ చేస్తాం

25 Nov, 2016 03:21 IST|Sakshi
రేపటిలోగా స్థలాన్ని ఖాళీ చేస్తాం

ఐమాక్స్ పక్కన పార్కింగ్ స్థలంపై హైకోర్టుకు నివేదించిన డాక్టర్ కార్స్
అప్పీల్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి  

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నుంచి ప్రసాద్స్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలాన్ని శనివారంలోపు ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. సింగిల్ జడ్జి తీర్పుపై తాము దాఖలు చేసిన అప్పీల్‌ను సైతం ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అప్పీల్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో హెచ్‌ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కనున్న స్థలాన్ని లీజుకు తీసుకుంది.

అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్‌ఎండీఏ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత స్టే ఎత్తివేయాలని కోరుతూ హెచ్‌ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్‌జడ్జి స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. దీనిపై డాక్టర్ కార్స్ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటిలోపు స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలంటూ కోర్టు విచారణను గురువారానికి వారుుదా వేసింది. అప్పీల్ గురువారం విచారణకు రాగా శనివారంలోపు స్థలాన్ని ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం కోర్టుకు నివేదించింది.

మరిన్ని వార్తలు