మినప రైతు గోడు పట్టని పాలకులు

15 Feb, 2017 22:32 IST|Sakshi
మినప రైతు గోడు పట్టని పాలకులు

విజయవాడ : రైతు సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విమర్శించారు. మినప రైతులను ఆదుకోవాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌–కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లాలో పర్యటించి, తెగుళ్ల బారినపడి మినుము పంట కోల్పోయిన రైతుతో మాట్లాడే వరకు ప్రభుత్వానికి ఈ సమస్య తెలియదన్నారు.

ఆ తరువాత మినప పంట కోల్పోయిన రైతులకు సీఎం చంద్రబాబు హెక్టార్‌కు రూ. 10వేలు వంతున ఇవ్వాలని నిర్ణయించారని టీడీపీ నేతలు ప్రకటించారన్నారు. మొవ్వ తెగులు, తలమాడు వైరస్‌ సోకి ఇప్పటికే  పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. మరో 10 రోజుల్లో పంట కాలం పూర్తవుతుందన్నారు. ఈ క్రమంలో దెబ్బతిన్న పంట చేలలో రైతులు రూ. 500, రూ. 1000 చెల్లించి గొర్రెల మేతకు వదిలేస్తున్నారని తెలిపారు. గతఏడాది మినుముకు అధిక ధర రావటం, ఈ ఏడాది సాగునీరు సరిగా సరఫరా చేయని కారణంగా జిల్లాలో రైతులు మినుము పంటను అధికంగా వేశారని ఆయన చెప్పారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చుచేశారని వివరించారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి...
తెగుళ్ల కారణంగా మినుము పంట పూర్తిగా దెబ్బతిందని వివరించారు. రైతు ప్రభుత్వమని డబ్బాలు కొట్టుకుంటున్న టీడీపీ నేతలు  రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదన్నారు.     కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని తెలిపారు. ఇప్పటివరకు పంటనష్టం అంచనా వేయకుండా పరిహారం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.  తక్షణమే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి పంట నష్టం అంచనా వేయించాలని సూచించారు.  ఏ రైతు పొలంలో ఎంత  నష్టం జరిగిందో లెక్కతేల్చి జాబితాలు తయారు చేయాలన్నారు. ఎకరాకు రూ. 15వేలు పరిహారంగా ఇవ్వాలని పార్థసారథి డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, పామర్రు, కైకలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు సింహాద్రి రమేష్, కైలే అనిల్‌ కుమార్, దూలం నాగేశ్వరరావు, బొప్పన భవకుమార్,  జిల్లా రైతు అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్,  పార్టీ నాయకులు కాసర్నేని గోపాలరావు, అడపా శేషు కుమార్, నెర్సు సతీష్, కంకిపాడు మండల పార్టీ అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, నగర స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు డి. అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు