పదవులు పొందిన వారు పార్టీ వ్యయం భరించాలి

5 Nov, 2016 23:15 IST|Sakshi
పదవులు పొందిన వారు పార్టీ వ్యయం భరించాలి
- కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు
- సమావేశంలో వలస నేతలకు అవమానం
- వేదికపై సీట్లు లేక అరగంట పాటు నిలబడిన భూమా, అఖిలప్రియ
- వేదికపై నుంచి వెళ్లిపోతుండగా అచ్చెన్న జోక్యం 
 
కర్నూలు: టీడీపీ తరఫున ఉన్నత పదవులు పొందిన వారు పార్టీ వ్యయాన్ని కూడా భరించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం స్థానిక కోల్స్‌ కళాశాలలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీజీ వెంకటేష్‌ నయా పైసా ఖర్చు లేకుండా టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారని.. జిల్లా పార్టీ నిర్వహణ వ్యయాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. పాత కొత్త కలయికలతో ముందుకు వెళ్దామని, ఆర్థికంగా, కుల పరంగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకొని మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం కోసం తుంగభద్ర నదిపై చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. సుంకేసుల బ్యారేజి నుంచి సమ్మర్‌ స్టోరేజీ  ట్యాంకుకు ప్రత్యేకంగా పైపులైను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. నగర జనాభా పెరిగినందున రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు మంజూరు చేయాలని, కర్నూలు చుట్టూ రింగురోడ్డు ఏర్పాటుకు అనుమతించి సర్వేకు ఆదేశించాలని సీఎంకు విన్నవించారు. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా టీజీ, ఎస్వీ విన్నపాలను ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు ప్రసంగించారు.
 
వలస నేతలకు అవమానం
తెలుగుదేశం పార్టీలో చేరిన వలస నేతలకు సమావేశంలో అవమానం జరిగింది.  నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియకు సీట్లు లేక సుమారు అరగంట పాటు వేదికపై నిలబడాల్సి వచ్చింది. చంద్రబాబు రాకకు ముందే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలంతా ముందు వరుసలో కూర్చున్నారు. సమావేశం ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ వేదికపైకి చేరుకున్నారు. అప్పటికే ముందు వరుసలో ఉన్న సీట్లు అన్నీ భర్తీ అయ్యాయి. ఎవరూ సీట్లు ఖాళీ చేయకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవడానికి ఇష్టం లేక తండ్రి, కూతురు వేదిక దిగి వెళ్లి పోతుండగా, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు కలుగజేసుకొని వెనక్కు పిలుచుకొని వచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి బీటీ నాయుడు సీట్లను ఖాళీచేయించి అక్కడ కూర్చోబెట్టారు. పక్కనున్న సీట్లలో మణిగాంధీ, బీటీ నాయుడులను సర్దుబాటు చేశారు. సమావేశం ముగింపు సందర్భంగా టీడీపీ తరఫున శాసన మండలి ఎన్నికల బరిలో ఉన్న బచ్చల పుల్లయ్య, కేజే రెడ్డిలను చంద్రబాబు కార్యకర్తలకు పరిచయం చేసి ఎలాగైనా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
 కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, శిల్పా మోహన్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, శివానందరెడ్డి, కేఈ ప్రతాప్, కేఈ శ్యామ్‌బాబు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, ఆకెపోగు ప్రభాకర్, పార్టీ  నాయకులు మసాల పద్మజ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు