మా పుట్టి మునుగుతుంది

21 Jul, 2016 00:18 IST|Sakshi
మా పుట్టి మునుగుతుంది
పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల రద్దుపై రైతుల బెంబేలు
జీఓ నం: 271పై వ్యక్తమవుతున్న తీవ్ర అభ్యంతరం
వెబ్‌ల్యాండ్‌ వివరాల్లో 60 శాతం తప్పులే..
యాజమాన్య హక్కులతో పాటు
రుణసదుపాయానికీ భంగకరమని ఆందోళన
నేడు అమలాపురంలో అఖిలపక్ష,
రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం
lచర్చల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ
భూమిపై యాజమాన్య హక్కును కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ప్రవేశపెడితే..ఆయన వారసుడినని చెప్పుకొనే చంద్రబాబు వాటిని రద్దు చేయడం రైతులకు ఆగ్రహం కలిగిస్తోంది. పట్టాదారు పాస్‌ పుస్తకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో అనుమానాల్నీ, ఆందోళననూ రేకెత్తిస్తోంది. భూమిపై హక్కులు కోల్పోతామని, బ్యాంకు రుణాలు కూడా రావని బెంబేలు పడుతున్నారు.
అమలాపురం :
పట్టాదార్‌  పాస్‌ పుస్తకాలను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతాంగం మండిపడుతోంది. ఆందోళనపథంలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే అమలాపురం మండలం ఈదరపల్లి జనహిత భవనంలో గురువారం అఖిల పక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తోంది. కాగిత రహితపాలనలో భాగంగా ప్రభుత్వం ఈ–పాస్‌ విధానం ప్రవేశ పెట్టింది. ఇప్పుడున్న పాస్‌ పుస్తకాలను రద్దు చేస్తూ వెబ్‌ ల్యాండ్‌లో ఉంచిన 1బి నమోదుల ఆధారంగా భూ యాజమాన్య హక్కుల బదలాయింపులు, రుణాల మంజూరు చేయాలని జీవో నం : 271 విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
1బిలో నమోదు కాని అనేక మార్పులు
పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ద్వారా రైతులు రుణాలు పొందడం, భూముల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ–పాస్‌ విధానం ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వం అందుకు తగిన విధంగా భూములను రీ సర్వే చేయాలి. నిజమైన భూమి 
యజమానులను గుర్తించి వెబ్‌ల్యాండ్‌లో పక్కాగా నమోదు చేయాలి. ఇప్పటి వరకూ వెబ్‌ల్యాండ్‌లో నమోదైన దానిలో 40 శాతం అసలైన భూమి యజమానులు ఉండగా మిగిలిన 60 శాతం తప్పుల తడకేనని రైతుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వీటిని సవరించకుండా పాస్‌ పుస్తకాలు రద్దు చేస్తే తాము మునిగిపోతామని రైతులు వాపోతున్నారు. తాతలు, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వారసత్వంగా పొంది చాలా మంది పాస్‌ పుస్తకాలు చేయించుకున్నారు. అయితే 1బిలో మార్పులు చేయలేదు. ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినవారు, పసుపుకుంకుమ కింద భూములు పొందిన కూతుళ్లు, వారి సంతానం పాస్‌పుస్తకాల మార్పులతో సరిపెట్టుకున్నారు. అవి వారి తల్లిదండ్రుల పేరుతోనే ఉన్నాయి. కొన్నిచోట్ల మూడెకరాలు ఉంటే 1బిలో ఒక ఎకరం నమోదయింది. మిగిలిన రెండు ఎకరాలు మరొకరి పేరు మీద ఉన్నాయి. కొన్నిచోట్ల దేవాదాయశాఖ బహిరంగం వేలం ద్వారా విక్రయించిన భూములు కూడా పాస్‌పుస్తకాలు మారాయి కాని 1బిలో నమోదు కాలేదు. వీటిని సరిదిద్దకుండా 1బి ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చే సేశారు. ఈ తప్పులను సరిదిద్దాలంటే చాలా వ్యయప్రయాసలకు లోనుకావాల్సి ఉంది. ఇప్పుడున్న భూ యజమానులకు భూమి చెందేలా చేయాలంటే రైతుల దస్తావేజులు తనిఖీ చేయాలి. అవసరమైన సందర్భాలలో రీ సర్వే కూడా చేయించాలి. ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థలో సిబ్బంది కొరత, మరీ ముఖ్యంగా సర్వేయర్ల కొరత వల్ల ఇది అసాధ్యమని రైతులు అంటున్నారు.
ఏకపక్షంగా రద్దు చేస్తే ఎన్నో 
అనర్థాలు..
ఈ మార్పులు చేయకుండా పాస్‌ పుస్తకాలను ఏకపక్షంగా రద్దు చేస్తే పలు అనర్థాలు జరిగే అవకాశముందన్నది రైతులు ప్రధాన అభ్యంతరం. 1బిలో ఉన్నవారు నేరుగా విక్రయాలు చేస్తే అసలు భూ యజమానులు నష్టపోతారని వారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు రుణాలు రావని ఆవేదన చెందుతున్నారు. అమలాపురంలో అఖిలపక్షాలతో సమావేశం కానున్న రైతు సంఘాల ప్రతినిధులు చర్చించిన ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. 
 
మరిన్ని వార్తలు