ప్రాణం తీసిన అతివేగం

4 Feb, 2017 23:14 IST|Sakshi
ప్రాణం తీసిన అతివేగం
– ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని యువకుడు దుర్మరణం 
ఓర్వకల్లు :  అతివేగం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. విధులకు ఆలస్యమైందనే ఆతృతతో వేగంగా బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన 18వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా.. శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బేతంచెర్ల మండలం, సిమెంట్‌ నగర్‌ గ్రామానికి చెందిన కటికె అబ్దుల్‌ గని కుమారుడు కటికె రహీం బాషా(22) కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉంది. దీంతో సిమెంట్‌ నగర్‌ నుంచి కర్నూలుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అప్పటికే డ్యూటీకి ఆలస్యం అయిందనే ఆతృతలో బైక్‌ వేగాన్ని పెంచేశాడు. మార్గమధ్యలో నన్నూరు సమీపాన గల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా ముందుగా వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో రహీమ్‌ బాషా తల పైభాగం పూర్తిగా దెబ్బతినడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సిమెంట్‌ నగర్‌లోని సిమెంట్‌ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్న కటికె అబ్దుల్‌ గనికి నలుగురు కుమారులు. మృతి చెందిన రహీమ్‌ బాషా చివరి వాడుగా పోలీసులు తెలిపారు. 
మరిన్ని వార్తలు