రోగులకు ‘దిక్కు’ తెలియడం లేదు!

12 Sep, 2016 23:10 IST|Sakshi
రోగులకు ‘దిక్కు’ తెలియడం లేదు!

–పెద్దాసుపత్రిలో కానరాని దిక్సూచిలు
–దారి తెలిపే బోర్డులు లేక ఇబ్బందులు
–చొరవ చూపని అధికారులు


కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు బోధనాసుపత్రి 120 ఎకరాల విస్తీర్ణం. హంద్రీ నుంచి కేసీ కెనాల్‌ వరకు ఉన్న స్థలమంతా దీనిదే. ఏ చికిత్సకు ఎక్కడకు వెళ్లాలో ఒక పట్టాన ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందే చెప్పలేరు. అలాంటిది సామాన్య జనం పరిస్థితి చెప్పనలవి కాదు. చీటీలు పట్టుకుని కనిపించిన వారినంతా అడుగుతూ ఆసుపత్రిలో కలియదిరగడం మనకు నిత్యం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సైన్‌బోర్డుల ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

    కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 40కి పైగా విభాగాలు ఉన్నాయి. వీటికి వార్డులు, ఓపీ విభాగాలు, వైద్యపరీక్షల ల్యాబ్‌లు, మందులు ఇచ్చే కౌంటర్లు, ఓపీ కౌంటర్లు ఒక్కటేమిటి అందా ఒక్కచోట గాకుండా ఎక్కడపడితే అక్కడ కొలువై ఉన్నాయి. సువిశాల విస్తీర్ణం 120ల ఎకరాలకు పైగా స్థలం ఉండటంతో ఆసుపత్రికి నిధులు వచ్చినట్లుగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ భవనాలు కట్టుకుంటే వెళ్లిపోయారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. మెడిసిన్‌ విభాగానికి చెందిన వార్డులు ఆసుపత్రికి నాలుగువైపులా ఉన్నాయి. ఆర్థోపెడిక్, సర్జరీ విభాగాలూ ముందు, వెనుకా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. స్త్రీ వ్యాధులకు ఓపీ ఒకచోట, అడ్మిషన్‌ ఒకచోట చేస్తున్నారు. సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఒక్కోటి ఒక్కోచోట విసిరేసినట్లుగా ఉన్నాయి. ఇక ల్యాబ్‌ల సంగతి సరేసరి. 24 గంటలు పనిచేసే ల్యాబ్‌తో పాటు రక్తగ్రూప్‌ పరీక్ష చేయించుకోవాలంటే బ్లడ్‌ బ్యాంక్‌ వద్దకు వెళ్లాలి. టీబీకి మాంటాక్స్‌ టెస్ట్‌ చేయించుకోవాలన్నా, కొన్ని వ్యాధులకు బయాప్సీ టెస్ట్‌ చేయించుకోవాలన్నా మెడికల్‌ కాలేజిలోని ల్యాబ్‌లకు వెళ్లాలి. ఎక్స్‌రే తీయించుకోవాలంటే ఆ దేవుడు ప్రత్యక్షమవ్వాల్సిందే. డాక్టర్‌ ఎక్స్‌రే రాస్తే ఇన్‌పేషంట్‌కైతే ఒకచోట, అవుట్‌పేషంట్‌కైతే మరోచోట, డిజిటల్‌ ఎక్స్‌రేకైతే ఒకచోట, సాధారణ ఎక్స్‌రేకైతే ఇంకోచోట వెళ్లాల్సిందే. దీనికితోడు డాక్టర్‌ రాసిన చీటిని తీసికెళితే వెంటనే ఎక్స్‌రే తీయరు. దానికి ఒకచోట డబ్బులు చెల్లించాలని రాయించుకుని రావాలి, మరోచోట డబ్బులు కట్టాలి. ఆ తర్వాతే ఎక్స్‌రే తీస్తారు. మందుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో దారి తెలియక రోగులు దిక్కులు చూస్తూ ఆసుపత్రిలో కలియదిరగడం ప్రతి ఒక్కరికి కలతకు గురిచేస్తోంది.
అటకెక్కిన సూచిక బోర్డుల ప్రతిపాదన
ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదురుగా ఓపీ కౌంటర్‌ వద్ద 30 ఏళ్ల క్రితం ఆసుపత్రిలో ఏ వార్డుకు ఎలా వెళ్లాలనే బోర్డు ఉండేది. ఆ తర్వాత ఇలాంటి బోర్డులు ఎక్కడా పెట్టలేదు. ఆసుపత్రిలో తిరిగే ప్రతి మలుపులో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఐదేళ్ల క్రితం ఉండేది. క్రమంగా అధికారులు దానిని మరుగునపెట్టేశారు. కేవలం లక్షలోపు ఖర్చు అయ్యే ఈ పనిని అధికారులు ఎందుకు చేపట్టడం లేదో అర్థం కాదు. ఆసుపత్రిలో ఇలాంటి సైన్‌బోర్డులు రాయడానికి అవసరమైన పెయింటర్‌ ఉన్నారు. అతనితో పెయింటర్‌ పనులు గాకుండా ఇతర పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు వివరాలు ఇచ్చాం
–డాక్టర్‌ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌
ఏపీఎంఎస్‌ఐడిసి వారికి ఆసుపత్రిలో ఎక్కడెక్కడ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలనే విషయమై వివరాలు ఇచ్చాం. ఈ మేరకు ఇంజనీరింగ్‌ అధికారులు, వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. చాలా రోజుల నుంచి ఈ ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమే. ఇటీవల విడుదలైన నిధులతో ఈ పనులను ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వారే త్వరగా చేయాలి.
 

>
మరిన్ని వార్తలు