ఎంజీఎం కిటకిట

13 Sep, 2016 00:58 IST|Sakshi
ఎంజీఎం కిటకిట
  • విష జ్వరాలతో పెద్దసంఖ్యలో 
  • దవాఖానలో చేరుతున్న రోగులు
  • వేధిస్తున్న పడకల కొరత
  • పడకేసిన వార్డుల నిర్వహణ
  •  
    ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా భావించే ఎంజీఎం దవాఖాన సీజనల్‌ వ్యాధులతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేకపోతోంది. ఫలితంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 383 మంది మలేరియా, 67 మంది డెంగీ బారిన పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద ఈ అంచనా గణాంకాలను బట్టి ఏజెన్సీ ప్రాంతాలు సీజనల్‌ వ్యాధులతో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయనేది వాస్తవం. 
     
    గత వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చోటుచేసుకుంటున్న వాతావారణ మార్పుల కారణంగా ప్రజలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ఇక జిల్లాలోనే పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలోనూ అదే విధమైన దుస్థితి తాండవిస్తోంది. ప్రధానంగా ఈ ఆస్పత్రిలో రోగులకు పడకల కొరత ప్రధాన సమస్యగా ఉంది. అదనపు వార్డులు, పడకలను సమకూర్చుకోవడంపై ఎంజీఎం వైద్యాధికారులు దృష్టిసారించడం లేదు. వారి తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
     
     అధ్వానంగా పిల్లల వార్డు..
    ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రస్తుతం 350 మంది చిన్నారులు విషజ్వరాజలతో చికిత్స పొందుతున్నారు. వారిలో అధికులు ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. అయినా ఆయా ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం లేదు. దవాఖానలోని పిల్లల విభాగంలోని వార్డుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. 138 పడకలకుగానూ 346 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పడకల కొరత కారణంగా ఒకే పడకలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల వార్డులో ఏసీ పనిచేయకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. దీనికి తోడు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటంతో ఆయా వార్డులకు రోగుల బంధువుల తాకిడి బాగా పెరిగిపోయి సంత వాతావరణం కనిపిస్తోంది. 
     
    ప్రైవేటు క్లినిక్‌లకు రోగులను తరలించకుంటూ..
    ఎంజీఎంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు మధ్యాహ్న అయిందంటే చాలు కనిపించకుండా పోతున్నారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోగులు లోలోన కుమిలిపోతున్నారు. కొంతమంది డాక్టర్లు రోగులను తమ ప్రైవేటు క్లినిక్‌లకు తరలించుకొని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు పక్కా నిఘా ఉంచితే వివరాలన్నీ బట్టబయలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎంజీఎంలో వైద్యసేవలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. 
మరిన్ని వార్తలు