బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ఉత్పాదనకు ప్రాధాన్యం

14 Oct, 2016 22:48 IST|Sakshi
గొల్లప్రోలు :
బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ఉత్పాదనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పట్టుపరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఇ.రాంబాబు తెలిపారు. డీడీగా బాధ్యతలు స్వీరించిన అనంతరం ఆయన మొదటిసారిగా చేబ్రోలు పట్టు పరిశ్రమకేంద్రం పరిధిలోని పట్టుక్షేత్రాలను శుక్రవారం సందర్శించారు. పట్టుపురుగుల పెంపకం షెడ్లను, మల్బరీతోటలను పరిశీలించారు. అలాగే పట్టురైతుల అనుభవాలను తెలుసుకున్నారు. పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను, రేరింగ్‌షెడ్డు సంరక్షణను, మల్బరీతోటల యాజమాన్యపద్ధతులను ఆయన రైతులకు వివరించారు.  అనంతరం ప్రయోగాత్మకంగా పెంపకం చేపట్టిన ఎఫ్‌సీ 3 క్ష 4రకం పట్టుగూళ్లను పరిశీలించారు. గూళ్ల నాణ్యత, దిగుబడిపై రైతులతో మాట్లాడారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చే శారు. ముఖ్యంగా సీతాకాలంలో తేమ నియంత్రణకు రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచించారు. రేరింగ్‌షెడ్డుకు గాలి విస్తారంగా తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేడిగాలి బయటకు పోయేలా షెడ్డు పైభాగంలో వెంటిలేటర్ల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. రానున్న 4 నెలల కాలంలో బైవోల్టిన్‌ పట్టుగూళ్ల పెంపకాన్ని అధికంగా చేపట్టేలా రైతులను చైతన్యపరుస్తున్నామన్నారు. మంచి దిగుబడులు సాధనకు ఎప్పటికప్పుడు ప్రత్యేక సూచనలు అందచేస్తున్నామన్నారు. అనంతరం ఆయన పట్టుపరిశ్రమ కేంద్రంలోని రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట ఏడీ ఎన్‌.సత్యనారాయణ, ఏఎస్‌ఓ కోనేటి అప్పారావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ కాకి రామచంద్రరావు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు