15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే

3 Jan, 2017 11:47 IST|Sakshi
15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే

- ప్రభుత్వానికి జనసేన అల్టిమేటం
- శ్రీకాకుళం కిడ్నీ బాధితులతో పవన్‌ కల్యాణ్‌ ముఖాముఖి


ఇచ్ఛాపురం:
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా 11 మండల్లాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను ఘోర విపత్తుగా పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, కనీసం కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం గర్హనీయమని విమర్శించారు. జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌.. కిడ్నీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై  స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

’పుష్కరాల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. క్యాపిటల్‌ కోసం లెక్కలేనంత డబ్బు వెచ్చిస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా కిడ్నీ బాధితులవైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు. అంతుచిక్కని విధంగా ఏళ్లుగా కొనసాగుతోన్న మరణాలపై కనీసం ఇక్కడి ప్రజాప్రతినిధులైనా మాట్లాడకపోవడం, పరిష్కార మార్గాలపై దృష్టిసారించకపోవడం దారుణం. ఇక్కడి నేతల తీరును జనసేన పార్టీ ఖండిస్తోంది’అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే
ఉద్దానం సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధులకు గురైనవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఒక కమిటీని ఏర్పాటుచేసి ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీలు ప్రకటించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. కిడ్నీ వ్యాధులపై జనసేన ఆధ్వర్యంలో ఐదుగురు డాక్టర్ల కమిటీని ఏర్పాటుచేస్తున్నామని, 15 రోజుల్లోగా ఒక రిపోర్టు తయారు చేయించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ’మేం రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతం’అని ప్రకటించారు. తక్షణ సాయంగా కిడ్నీ బాధిత కుటుంబాల్లో అనాథలైన చిన్నారుల బాధ్యతలను ప్రభుత్వాలు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. డయాలసిస్‌ అనేది చికిత్సకాదన్ని ఇంగితం మంత్రికి లేదా? అని ప్రశ్నించారు.

ఉద్దానం.. భయంభయం
11 మండలాల్లో 20వేల మరణాలు:
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన శ్రీకాకుళం కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్య ఈ నాటిదికాదు. 11 మండల్లాలోని 104 గ్రామాల్లో కనీసం 25 వేల మంది కిడ్నీ వ్యాధులకు గురయ్యారు. మరో 20 వేలమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కవిటి మండలం ఉద్దానం, పొందూరు మండలం భగవానుదాసుపురం, పలాస, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నారు.

అసలు ఎందుకీ సమస్య: మూడేళ్ల కిందట హార్వర్డ్‌ యూనివర్సిటీ బృందం జిల్లాలో కిడ్నీ రోగాలకు గల కారణాల్ని అన్వేషించింది. ఇక్కడి ప్రజలు వినియోగిస్తున్న నీటిలో సిలికాన్‌ అధిక మోతాదులో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఆతర్వాత పలు యూనివర్సిటీలు, దేశవైద్య బృందం కూడా సర్వేలు జరిపాయి. అయినాసరే, కారణాన్ని కనుగొనలేకపోయారు. కారణాల సంగతి ఎలావున్నా, కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. జిల్లాలో డయాల్సిస్‌ యూనిట్లు ఉన్నా.. నెఫ్రాలజిస్టులు లేరు. దీంతో బాధితులు వైద్యం కోసం విశాఖ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తున్నది.

మరిన్ని వార్తలు