ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతుల హక్కు

30 Jun, 2017 23:43 IST|Sakshi
ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతుల హక్కు

అనంతపురం సెంట్రల్‌ : ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదని, రైతుల హక్కు అనే విషయం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అనంతరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల డబ్బు వారికిచ్చే విషయంలోనూ ప్రచారం చేసుకునేందుకే ముఖ్యమంత్రి ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అర్హత పత్రాల పేరిట ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను ముద్రించి కార్డులు అందజేయడం హాస్యాస్పదమన్నారు.

ఒక్కో కార్డుకు రూ.10 చొప్పున జిల్లాలో 6లక్షల మందికి కార్డులు ఇచ్చేందుకు రూ.60లక్షలు దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం 2016 ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,032 కోట్లు ఇస్తున్నారని.. అయితే గత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన వారికి రూ.4,087కోట్లు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన రైతులకే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇంతవరకు అర్హుల జాబితా ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అర్హులకు న్యాయం జరక్కపోతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు