సామరస్యమే ఇస్లాం మూలసూత్రం

20 Feb, 2017 22:25 IST|Sakshi
సామరస్యమే ఇస్లాం మూలసూత్రం
- కులమతాలకు అతీతంగా సాయపడే గుణం ఉండాలి 
- ముఫ్తి తల్లాసాహబ్‌ ఖాస్మి నక్ష్‌బందీ
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముస్లింలు కుల, మతాలకు అతీతంగా సాయపడే గుణం కలిగి ఉండాలని ముంబయికి చెందిన ఇస్లామిక్‌ స్కాలర్, ముఫస్సిర్‌-ఎ-ఖురాన్‌ ముఫ్తి తల్హా సాహబ్‌ ఖాస్మి నక్ష్‌బందీ సూచించారు. జమైతుల్‌ ఉల్మా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఇస్లామియా డిగ్రీ కళాశాల మైదానంలో ‘రాబోవు సమస్యలకు పవిత్ర ఖురాన్‌లో సూచించిన పరిష్కార మార్గాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక బహిరంగ సభలో నక్ష్‌బందీతో పాటు జమైతుల్‌ ఉల్మా రాష్ట్ర అధ్యక్షుడు హాఫిజ్‌ పీర్‌ షబ్బీర్‌ ప్రసంగించారు. అందరితో సఖ్యతగా ఉంటూ సామరస్యాన్ని కాపాడడమే ఇస్లాం మూల సూత్రమని తెలిపారు. పవిత్ర ఖురాన్‌లోనూ ఇవే అంశాలను సూచించారని, వాటిని మహమ్మద్‌ ప్రవక్త ఆచరించారన్నారు.  ఏవైనా సామాజిక సమస్య వచ్చినప్పుడు కుల, మతాలకు అతీతంగా అందరి ఆమోదంతోనే పరిష్కరించాలన్నారు. పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలని, అలాంటి చదువులనే ప్రోత్సహించాలని కోరారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖాజీ అబ్దుల్‌మజీద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి  జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివచ్చారు. 
 
మరిన్ని వార్తలు