ప్రశాంతం

9 Mar, 2017 22:30 IST|Sakshi
ప్రశాంతం

ముగిసిన మండలి ఎన్నికల పోలింగ్‌
- ఓటు హక్కు వినియోగానికి ఉపాధ్యాయుల ఉత్సాహం
- పెద్దగా ఆసక్తి కనపర్చని పట్టభద్రులు
- ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన టీడీపీ అభ్యర్థులు
- పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన

    పట్టభద్రుల నియోజవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేజే రెడ్డి
- చాగలమర్రిలో అభ్యర్థి బచ్చల పుల్లయ్య రిగ్గింగ్‌ యత్నం
- డోన్‌లో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతల వాగ్వాదం


కర్నూలు(అగ్రికల్చర్‌): శానమండలి పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజవర్గం ఎన్నికల పోలింగ్‌ కర్నూలు జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌ మందకోడిగా సాగింది. పోలింగ్‌ ప్రారంభం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ అంతంత మాత్రంగానే ఉంది. ఉపాధ్యాయ నియోజకవర్గం పోలింగ్‌ మాత్రం భారీగా జరిగింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్‌ రోజున కూడా టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు ఉండిపోవడం గమానార్హం.

 

పలు పోలింగ్‌ కేంద్రాల్లో తమ పేర్లు గల్లంతయ్యాయని పట్టభద్రులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టభద్రుల నియోజవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేజే రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం విమర్శలకు తావిచ్చింది. పోలింగ్‌ రోజు అభ్యర్ధులకు మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ఏకంగా పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ఇంత చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. చాగలమర్రిలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి బచ్చల పుల్లయ్య రిగ్గింగ్‌కు ప్రయత్నించినట్లు సమాచారం. తన మద్దతుదారులైన 10 మంది ఉపాధ్యాయులను వెంట పెట్టుకొని పోలింగ్‌ కేంద్రంలోకి దౌర్జన్యంగా వెళ్లి రిగ్గింగ్‌కు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

డోన్‌లోని ఎస్‌కేపీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 249 పోలింగ్‌ కేంద్రంలో ఏజెంటుగా ఉన్న ఓ పత్రికా విలేకరి గేయానంద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం చెప్పడంతో తహసీల్దారు బయటికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. బనగానపల్లిలో పోలింగ్‌ సమయం ముగుస్తుందనగా ఎక్కువ మంది ఓటర్లు రావడంతో పోలింగ్‌ రాత్రి 8 గంటల వరకు సాగింది.

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ
జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టరేట్‌ సమీపంలోని ఇందిరాగాంధీ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తన సతీమణితో వెళ్లి బి.క్యాంపు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రల పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు వేశారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సతీమణితో కలిసి పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు కోల్స్‌ మెమోరియల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు జిల్లా అధికారులతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌, నాయకుడు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి తదితరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

పోలింగ్‌ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కాన్ఫరెన్స్‌ హాల్‌లో వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తూ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జోనల్‌ అధికారులు, ఆర్‌డీఓలతో ఫోన్‌లో మాట్లాడుతూ పోలింగ్‌ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు.
 

మరిన్ని వార్తలు