పేదల భూములు.. పెద్దల సొంతం

24 May, 2017 00:12 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేదల భూములపై అధి కార పార్టీ పెద్దల కన్నుపడింది. సుమారు రూ.5 కోట్ల విలువైన రెండెకరాల భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. దానిని ప్లాట్లుగా విభజించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నేత అండదండలతోనే ఈ తంతు నడుస్తోంది. దళితులకు కేటాయించిన అస్సైన్డ్‌ భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకపోయినా పంచాయతీ సిబ్బంది నిర్వాకంతో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహా రం సాగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం వెంకటాపురం çపంచాయతీ పరిధిలోని సుంకరవారి తోటలో  సుమారు 20 ఏళ్ల క్రితం నిరుపేద ఎస్సీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం వ్యవసాయం భూమి పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి 25 సెంట్ల చొప్పున మొత్తం 8 మందికి రెండెకరాల భూమిని అధికారులు అందించారు. వ్యవసాయం చేసుకోవాలని పేదలకు సూచించారు. కొన్నేళ్ల తర్వాత ఈ భూముల చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్‌ లేఅవుట్లు వెలిశాయి. దీంతో అక్కడి భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తుల కళ్లు ఈ భూమిపై పడింది. పేద కష్టాలను ఆసరా చేసుకుని తక్కువ మొత్తానికే ఆ భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్సీ, బీసీ నాయకులమంటూ కొందరు రంగంలోకి దిగారు. అస్సైన్డ్‌ భూముల కొనుగోలు నేరమంటూ  బ్లాక్‌మెయిల్‌ చేసి సొమ్ములు గుంజుకున్నారు. ఇలా భూములు చేతులు మారాయి. ఇప్పుడు ఆ భూమిని లే–అవుట్‌ చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయం నుంచి లే–అవుట్‌ అనుమతులు సైతం పొందారు. నిజానికి అస్సైన్డ్‌ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు.
 
అధికార పార్టీ కనుసన్నల్లో..
ఇప్పుడు ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నేత చేతుల్లోకి వెళ్లింది. అస్సైన్డ్‌ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవాలంటే.. తనకు పర్సంటేజీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా ఆ నాయకుడు డిమాండ్‌ చేసినట్టు సమాచారం. నెల రోజులపాటు తర్జనభర్జనల అనంతరం ఆ భూమిని ప్లాట్లుగా విభజిస్తున్న వ్యక్తులు మాజీ ప్రజాప్రతి నిధి ద్వారా టీడీపీ నేతలకు మొత్తం లాభంలో 25 శాతం కమీషన్ ఇచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పనులు వేగం పుంజుకున్నాయి. భూమిని పూడ్చటానికి మట్టి తోలకాలు చురుగ్గా సాగుతున్నాయి.
 
కలెక్టర్‌కు ఫిర్యాదు
తమ భూములను అక్రమంగా లే–అవుట్‌ చేసి విక్రయించేందుకు కొం దరు వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ భూములను తమకు తిరిగి ఇప్పించాలంటూ గతంలో భూములు పొందిన కొందరు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్‌ఎస్‌ నంబర్‌ 903–1బీ4లో ప్రభుత్వం 25 సెంట్ల చొప్పున భూమిని కేటాయిం చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వెంకటాపురం పంచాయతీ సిబ్బంది కలిసి లే–అవుట్‌ చేసినట్టుగా పత్రాలు సృష్టించి తమ భూముల్ని కాజేస్తున్నారని వాపోయారు. ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని లబ్ధిదారులు కొత్తపల్లి కుటుంబరావు, ముల్లంగి వెంకటేశ్వరరావు, ఇమ్మల జ్యోతి తదితరులు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

 

మరిన్ని వార్తలు