పెద్దలు కాదు గద్దలు

3 Jun, 2017 02:06 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల కోసం చేపట్టిన భూసేకరణ అధికార పార్టీ పెద్దలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వేరొకరి భూములను దర్జాగా అమ్మేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ వివాదాలు తలెత్తాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాలు పూర్తిస్థాయిలో సద్దుమణిగాయి. గిరిజనులు, గిరిజనేతరులు ఎవరికి హక్కున్న భూయుల్లో వారు సాగు చేసుకుంటూ సోదర భావంతో మెలిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వివాదాలు మొదటికొచ్చాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. 
 
తహసీల్దార్‌ కార్యాలయాల్లో తిష్టవేసి..
తెలుగు తమ్ముళ్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లో తిష్టవేసి ఆన్‌లైన్‌లో భూమి రికార్డులను తమకు నచ్చిన విధంగా మార్చుకున్నారు. వీఆర్‌ఓ, ఆర్‌ఐలతో సంబంధం లేకుండా తహసీల్దార్‌లే కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కూర్చుని భూముల వివరాలను కంప్యూటరీకరణ చేశారు. అదే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కాసుల వర్షం కురిపిస్తుంది. తమ భూములు కాకపోయినా అన్‌లైన్‌ రికార్డులను చూపించి భూ సేకరణలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా జీలుగుమిల్లి మండల టీడీపీ అ«ధ్యక్షుడు వి.సోమసుందరం స్వర్ణవారి గూడెం రెవెన్యూ పరిధిలో  ఉన్న 30 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేయించి.. పోలవరం ప్యాకేజీలో అమ్మకానికి పెట్డారు. అన్ని హక్కులూ తనకే ఉన్నాయని అదే గ్రామానికి చెందిన బుద్దే శ్రీనివాసరావు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. అధికార పార్టీ అ«ధ్యక్షుడు సోమసుందరం తనదిగా చెప్పుకుంటున్న భూమికి సంబంధించి 1997లో స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై సోమసుందరం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్నాడు. హైకోర్టులో స్టే కొనసాగుతుండగానే అదే భూమిని పోలవరం భూసేకరణలో అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై భూసేకరణ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదని సమాచారం. దీనిపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు