కోటకు బీటలు

20 Jul, 2016 20:28 IST|Sakshi
పెద్దశంకరంపేటలోని గడికోట
  • శిథిలావస్థల్లో కట్టడం
  • వందల ఏళ్లనాటి కట్టడంపై నిర్లక్ష్యం
  • పట్టించుకోని అధికారులు
  • కట్టడాలు కాపాడాలని స్థానికుల విన్నపాలు
  • పెద్దశంకరంపేట: వందల ఏళ్ల నాటి చరిత్రకు నిదర్శనంగా నిలిచిన అపురూప చారిత్రక కట్టడాలు బీటలు వారుతున్నాయి. తరతరాల చరిత్రకు సాక్షాలుగా మిగిలే కట్టడాలను కాపాడి రేపటి తరాలకు చూపాల్సిందిపోయి అధికారుల, పాలకుల, పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రక కట్టడంపై మొక్కలు పెరిగి కూలడానికి సిద్ధమయ్యాయి.

    పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న 40 అడుగుల ఎత్తుగల కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పరిపాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ వారి వారసులు 12 తరాల పాటు ఈ కోటనుంచే పాలించినట్లు గత చరిత్ర తెలుపుతోంది.

    అప్పటి కళావైభవానికి ప్రతీకగా నిలిచే ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో  నిర్మించారు. దీనిలో గుర్రపు శాలలు, ఎనుగు శాలలు ఉన్నాయి. వీటితో పాటు కోటలో ఉన్న సొరంగం ఒకటి గురుపాదగుట్టకు, గ్రామ శివారుకు దారితీస్తోందని పూర్వీకులు చెబుతుంటారు. రాణి శంకరమ్మ పేరు మీదుగా పేటకు శంకరంపేట అనే పేరొచ్చింది.

    ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలతో పాటు పేటకు వచ్చిన ప్రతీ కొత్త వారు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ కోటపై రావిచెట్లు, మర్రిచెట్లు మొలవడంతో ఈ కోట బీటలు వారుతోంది. దీంతో కూలేందుకు సిధ్దంగా ఉంది. ఇప్పటికి ఎంతో విలువైన సంపద కోట, సొరంగంలో నిక్షిప్తమై ఉందని స్థానికులు చెబుతుంటారు. అలాంటి ఈ కోటను పురావస్తు శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడం పేట ప్రజలను మనోవేదనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చారిత్రక కట్టడాలను సంరక్షించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు