రాఘవుడి నెత్తిన బకాయిల భారం

9 Dec, 2016 22:44 IST|Sakshi
రాఘవుడి నెత్తిన బకాయిల భారం
- అద్దె చెల్లింపులో మొండికేసిన లీజర్లు
- గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి గండి
- రూ.21 లక్షల వరకు బకాయిలు 
 
మంత్రాలయం : శ్రీమఠం వ్యాపార దుకాణాలు స్వార్థపరుల జేబులు నింపుతున్నాయి. బంధుప్రీతి, రాజకీయ అండదండలతో వ్యాపార దుకాణాలను సొంతం చేసుకున్న లీజర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి రూ.కోట్లతో గండి కొడుతున్నారు. అద్దెలు చెల్లించకుండా శ్రీరాఘవుడి నెత్తిన మోయలేని భారం మోపుతున్నారు. çసబ్‌ లీజర్లను ముక్కుపిండి వసూళ్లు చేసుకుంటున్న లీజర్లు శ్రీమఠానికి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా బకాయిల భారం అక్షరాల రూ.21 లక్షలకు చేరింది. ఇన్నాళ్లకు కోలుకున్న శ్రీమఠం .. నోటీసుల జారీకి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించి కార్యాన్ని కానిస్తోంది. 
వ్యాపార దుకాణాలు ..
శ్రీమఠం పరిధిలో మొత్తం 340 వ్యాపార దుకాణాలుండగా నదీ తీరంలో 174, ప్రాకారం ఆగ్నేయ దిశలో 54, శ్రీమఠం ప్రధాన ముఖద్వారంతో 50, విజయవిఠల మందిరంలో 60 దుకాణాలు కలవు. మరిన్ని దుకాణాలు వసతి నిలయాలు, అన్నపూర్ణభోజన శాలకు ఎదురుగా ఉన్నాయి. రూ.600-8 వేల వరకు దుకాణాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.3 లక్షలకు పైగా అద్దెలు వస్తున్నాయి. 
గ'లీజుల' యవ్వారం ..
శ్రీమఠం 340 దుకాణాలను అద్దెకు ఇచ్చింది. శ్రీమఠం అధికారులు, పీఠాధిపతి సమీప బంధువులు, రాజకీయ అండదండలు కల్గిన వ్యక్తులు తక్కువ ధరకే దుకాణాలను సొంతం చేసుకుని సబ్‌ లీజులకు ఇచ్చారు. దాదాపు 250 దుకాణాలు సబ్‌ లీజులతో నడుస్తున్నాయి. శ్రీమఠానికి రూ.2 వేలు చెల్లిస్తుండగా సబ్‌లీజర్‌తో రూ.10వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసుకుంటున్నారు. దీనికి తోడు అడ్వాన్సుల పేరుతో రూ.2 - రూ. 8 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
బకాయిల పాపం రూ.21 లక్షలు..
శ్రీమఠం అధికారుల అలసత్వంతో రాఘవుడి నెత్తిన మోయలేని భారం పడింది. అద్దెలు వసూలు చేయడంలో చేసిన తాత్సారం శాపంగా మారింది. ప్రస్తుతం బకాయిల మొత్తం రూ.21 లక్షలకు చేరింది. కొంతమంది లీజర్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డారు. నెల నెలా పక్కాగా అద్దెలు వసూలు చేసుకుంటున్నా శ్రీమఠానికి లీజుల చెల్లింపులో మాత్రం మొండికేస్తున్నారు. ఇలా మిగులుబాటు అయిన సొమ్ముతో అంతస్తులు కట్టుకున్న లీజర్లూ ఉన్నారు. దేవుడికే శఠగోపం పెడుతున్నా శ్రీమఠం అధికారులు మొద్దునిద్ర వహించడం శోచనీయం. బకాయి లీజర్ల నుంచి ఇన్నాళ్లు వసూలు చేయకుండా వదిలేయడం విడ్డూరం.
 
నోటీసులు జారీ చేశాం : ఎస్‌.కె. శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్‌ 
అద్దెలు చెల్లించకుండా మొండికేసిన లీజర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. సకాలంలో బకాయిలు చెల్లించాలని సూచించాం. అలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లీజర్ల నుంచి దుకాణాలు స్వాధీనం చేసుకుంటాం. నోట్ల రద్దుతో కొంత మంది బకాయిలు చెల్లించారు. అయితే తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. బకాయిదారులు వెంటనే బకాయిలు చెల్లించి శ్రీమఠానికి సహకరించాలి. 
 
మరిన్ని వార్తలు