టీడీపీ నేతల స్వార్థానికి పెన్నా ఖాళీ

30 Apr, 2017 23:18 IST|Sakshi
టీడీపీ నేతల స్వార్థానికి పెన్నా ఖాళీ

- వారి ఇసుక దందాతో రైతులకు తీవ్ర నష్టం
- ఇలాగైతే ముందుముందు తాగునీరు కూడా దొరకదు
- పెన్నానది పరిశీలనలో శంకరనారాయణ


నారనాగేపల్లి(రొద్దం) : స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న ఇసుక దందాతో పెన్నానది ఖాళీ అవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. మండలంలోని నారనాగేపల్లి గ్రామ సమీపంలోని పెన్నానదిని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు బెంగళూరు, పావగడ ప్రాంతాలకు రాత్రింబవళ్లూ ఇసుకను తరలిస్తూ పెన్నాను తోడేస్తున్నారని, దీంతో పెన్నాను నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు రోడ్డున పడాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఫిల్టర్‌ బోర్లు ఎండిపోయి వందలాది మంది రైతులు నష్టపోతున్నారన్నారు. మండంలో అనేక మంది పెన్నా ఒడ్డున పూల తోటలు సాగు చేసేవారని, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిన పూలతోటలే దర్శనమిస్తున్నాయని ఆవేదన చెందారు.

ఇసుకాసురులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో తాగునీరు కూడా దొరకదన్నారు. ఇసుక మాఫియా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అధికారులు, పోలీసుల ఎదుటే ఇసుక అక్రమ దందా సాగిస్తున్నా వారు ఎందుకు అరికట్టలేకపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటివారిని ప్రోత్సహించడం వల్లే వారు ఇష్టానుసారం దోపిడీ పాల్పడుతున్నారని విమర్శించారు. ఇసుకాసురులు ఏర్పేడులో 15 మందిని పొట్టున పెట్టుకున్నా, కారకులైన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అందులో టీడీపీ వారు ఉండటం వల్లే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై రైతులు పలుమార్లు ఆందోళనలు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

కొన్ని గ్రామాల్లో ఇసుకమాఫియా రైతులపై దాడులకు దిగిన సందర్భాలు, పెన్నానదిలో రైతుల బోర్లు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక ఉచిత ఇసుక పాలసీ తెచ్చి అధికార పార్టీ నేతల జేబులు నింపారని దుయ్యబట్టారు. మహిళా సంఘాల పేరున ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇసుక రవాణాను అరికట్టకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు