కాసులకు కటకట

16 Dec, 2016 23:35 IST|Sakshi
కాసులకు కటకట
  •  38 రోజులైనా తీరని కరెన్సీ కష్టాలు
  • బ్యాంకుల వద్ద 'నోక్యాష్‌' బోర్డులు.. ఏటీఎంల మూత
  • మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి!
  • ధర్మవరంలో ఎస్‌బీఐ ఖాతాదారుల ఆందోళన
  • కళ్యాణదుర్గంలో ఏటీఎంకు పిండ ప్రదానం
  • అనంతపురం అగ్రికల్చర్‌ :

    పెద్ద నోట్లు రద్దు చేసి శుక్రవారం నాటికి 38 రోజులైనా ప్రజల కష్టాలు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. కనీస అవసరాలకు డబ్బు కోసం అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి జిల్లాకు సరిపడా నగదు సరఫరా కాకపోవడంతో బ్యాంకుల వద్ద 'నో క్యాష్‌' 'క్యాష్‌నిల్‌' బోర్డులు పెట్టారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాఖల్లో నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, యాడికి, కనగానపల్లి, బత్తలపల్లి, బుక్కపట్నం, కణేకల్లు, గుత్తి తదితర ప్రాంతాల్లో డబ్బు కోసం జనం అనేక అవస్థలు పడుతున్నారు. పేదలు, రైతులు, మహిళలు, సామాన్యులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఎక్కువ ఖాతాలు కలిగిన ఎస్‌బీఐ, ఆంధ్రా, సిండికేట్‌, ఏపీజీబీ, కెనరా, కార్పొరేషన్‌  లాంటి ప్రధాన బ్యాంకుల్లోనే నగదు కొరత వేధిస్తోంది. దీంతో విత్‌డ్రాలు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పరిమితం చేశారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పెన్షనర్లు, ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.

    ఎనీ టైం మూత!

    రోజులు గడుస్తున్నా ఏటీఎంల పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. జిల్లా వ్యాప్తంగా 556 ఏటీఎంలు ఉన్నాయి. శుక్రవారం 40 నుంచి 60 ఏటీఎంలు పాక్షికంగా పనిచేశాయి. వాటిలోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయి. కొన్నిచోట్ల ఏటీఎంలను రాత్రిపూట తీస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ జనం బారులు తీరుతున్నారు. శుక్రవారం జిల్లా అంతటా 34 ప్రిన్సిపల్‌ బ్యాంకులు, వాటి పరిధిలోని 445 శాఖల ద్వారా కేవలం రూ.15 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. ఎంత సర్దుబాటు చేస్తున్నా  తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకు అధికారులు వాపోతున్నారు. నగదు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో శనివారం మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చని  అంచనా వేస్తున్నారు. సోమవారం నాటికి కాని కొంత నగదు సరఫరా అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అదే పక్కనున్న చిత్తూరు, వైఎస్సార్‌, కర్నూలు జిల్లాలకు మాత్రం పెద్దమొత్తంలో నగదు సరఫరా అవుతోంది. 'అనంత'కు మాత్రం ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు ఎక్కువ వచ్చేలా జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పట్లో సమస్యకు పరిష్కారం దొరకదు.

    రోడ్డెక్కుతున్న ఖాతాదారులు

    నగదు కష్టాలు రెట్టింపు అవుతుండడంతో ఖాతాదారులు సహనం కోల్పోతున్నారు. రోడ్డెక్కి తమ నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్‌లో ఎస్‌బీఐ ఖాతాదారులు కొద్దిసేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఉదయం 11 గంటలైనా బ్యాంకు గానీ, ఏటీఎంలు గానీ తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్దనున్న ‘దండగమారి ఏటీఎం’కు వైఎస్సార్‌సీపీ నాయకులు పిండ ప్రదానం చేశారు.

     

మరిన్ని వార్తలు