మరణం తర్వాతా పింఛన్‌ తీసుకుంటోంది

4 Jan, 2017 00:21 IST|Sakshi
- నాలుగేళ్లుగా స్వాహా చేస్తున్న వైనం
- హొళగుందలో స్వాహాపర్వం
హొళగుంద: మండల ‍కేంద్రానికి చెందిన లింగాయతి మల్లమ్మ చనిపోయి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ సామాజిక భద్రతా పింఛన్‌ తీసుకుంటోంది. ఆధార్‌ లింకేజీ సైతం పూర్తి చేసుకుని నిరంతరాయంగా పింఛన్‌ పొందుతోంది. నమ్మేందుకు విడ్డూరంగా ఉన్నా అక్రమార్కులు నిజం చేస్తున్నారు మరి. అసలు విషయంలోకి వెళ్తే.. హొళగుంద 5వ వార్డుకు చెందిన మల్లమ్మ (ఐడి నం 113108306) మరణించి నాలుగేళ్లు పైగా అయింది. అయితే ఈ రోజుకూ ఆమె పింఛన్‌ తీసుకుంటున్నట్లు అక్విటెన్స్‌లో నమోదవుతోంది. 2016 డిసెంబర్‌ వరకు రూ.వెయ్యి ఇచ్చినట్లు ఆక్విటెన్స్‌లో రికార్డయింది. ఈ నెల కూడా బట్వాడ జరిగినట్లు ఆమె కోడలు సిద్ధమ్మ తెలిపింది. మరణానికి ముందు ఆమె మాన్యువల్‌గా పింఛన్‌ తీసుకునేది. బయోమెట్రిక్‌ విధానం వచ్చినా ఆమె పేరు కొనసాగడం అశ్చర్యం కలిగిస్తోంది. గతంలో పింఛన్‌ బట్వాడా చేసే వాళ్లు  బయోమెట్రిక్‌లో వేరొకరి వేలిముద్ర తీసుకుని వారి బ్యాంక్‌ ఖాతా నంబరు, ఆధార్‌ నంబర్ల్లను వేసుకుని నేటికి పింఛన్‌ డబ్బును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్లమ్మ కోడలు వితంతు పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకోగా సదరు రేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ 132400100325)పై ఇప్పటికీ పింఛన్‌ పంపిణీ చేస్తున్నట్లు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి ఇన్‌చార్జ్‌ ఈఓ రాంబాబును వివరణ కోరగా వృద్ధులు కావడంతో వేలిముద్రలు తీసుకుని డబ్బులు ఇస్తుంటామని, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలిసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
మరిన్ని వార్తలు