పింఛన్లు పాత పద్ధతిలో ఇవ్వాలి

3 Dec, 2016 00:03 IST|Sakshi
పింఛన్లు పాత పద్ధతిలో ఇవ్వాలి

అనంతపురం అర్బన్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పింఛను పంపిణీ విధానంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందిపడే పరిస్థితి నెలకొందని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. పింఛను పాత విధానంలో ఇవ్వాలంటూ శుక్రవారం నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, పింఛనుదారులు స్థానిక ప్రెస్‌ క్లబ్‌ నుంచి టవర్‌ క్లాక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి కార్పొరేషన్‌ కాంప్లెక్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ నల్లధనం అరికట్టెందుకు పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.

అయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ఈ చర్యతో సామాన్యులు, ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాచే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. ఇదే క్రమంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ బ్యాంకులకు అనుసంధానం చేయడంతో డబ్బులు అందక పింఛనుదారుల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పింఛనుదారులకు పాత పద్ధతిలో పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు చండ్రాయుడు, ప్రకాశ్, వలి, నాగప్ప, రామిరెడ్డి, ఓబులేసు, గఫూర్, నూరుల్లా, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి, పింఛనుదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు