ఆ విషాదానికి రెండేళ్లు

7 Jan, 2017 00:19 IST|Sakshi
ఆ విషాదానికి రెండేళ్లు

- జీవచ్ఛవాలుగా పెనుకొండ బస్సు ప్రమాద బాధితులు
- ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ సాయం


పెనుకొండ సమీపంలోని ‘షీప్‌ ఫామ్‌’. 2015 జనవరి 7న ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు’ బస్సు (ఏపీ 28 జెడ్‌ 1053) పెనుకొండకు చేరువలో ఉంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన గ్రామీణ విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. స్నేహితులైన విద్యార్థులు ఉత్సాహంగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటున్నారు. మరికొందరు మరో రెండ్రోజుల్లో రానున్న సంక్రాంతి సెలవులు ఎలా గడపాలో ముచ్చటించుకుంటున్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా... పల్లె వెలుగు బస్సు కాస్తా మృత్యు శకటమైంది.

ముందు వెళుతున్న ఆటోను దాటి వెళ్లే క్రమంటో ఘోర ప్రమాదానికి గురైంది. ఇరుకు ఘాట్‌ రోడ్డు పక్కనే ఉన్న 150 అడుగుల లోతైన గుంతలో పడిపోయి కుప్పలా మారిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలు.. 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. మృతుల్లో మావటూరు, బండపల్లి, నాగలూరు తదితర గ్రామాలకు చెందిన ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు.  త్రీవంగా గాయపడిన 65 మందిని పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. ఈ విషాదానికి నేటితో సరిగ్గా రెండేళ్లు. జీవచ్ఛవాలుగా మారిన బాధితులకు ప్రభుత్వ సాయం ప్రకటనలకే పరిమితమైంది.
- పెనుకొండ

తక్షణ సాయమందించి ఆదుకున్న జగన్‌
ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణలతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరిన బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు జగన్‌ తక్షణ సాయంగా రూ. లక్ష చొప్పున సాయమందించారు. క్షతగాత్రులకూ తగిన సాయాన్ని అప్పట్లో ఆయన అందించారు. ఈ ఘటనతో ఆలస్యంగా తేరుకున్న ప్రభుత్వం... మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఈ పరిహారం నేటికీ చాలా మందికి అందలేదు. బాధిత విద్యార్థుల్లో చాలామంది కాళ్లు చచ్చుబడిపోయి, ఆపరేషన్‌ సమయంలో వేసిన స్టీల్‌ రాడ్‌లను తొలగించుకునే ఆర్థిక స్థోమత లేక, మెరుగైన చికిత్సలు చేయించుకునేందుకు డబ్బు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారు.

నడవలేకున్నా...
తల్లిదండ్రులకు భారంగా మారాను. కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితిలో ఉన్నాను. మాది నిరుపేద కుటుంబం. కూలినాలి చేసుకుని నా తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాసులు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రమాద జరిగినప్పుడు ప్రభుత్వం అందజేసిన రూ. 2 లక్షలు నా చికిత్సలకే అయిపోయింది. ఇంకా కోలుకోలేదు. ఓపెన్‌ ఇంటర్‌కు కట్టాను. ప్రభుత్వం స్పందించి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి. లేకుంటే బతుకు కష్టమవుతుంది.
- మూలింటి రమణ, ఇంటర్‌ విద్యార్థి, మావటూరు, పెనుకొండ మండలం     

ఆరోజు నుంచి మంచంపైనే..
ప్రమాదం జరిగినప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాను. ప్రమాద సమయంలో ప్రభుత్వం రూ. 2లక్షలు ఇచ్చింది. ఇది ఆస్పత్రి ఖర్చులకే సరిపోలేదు. ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు పెడుతూ మా తల్లిదండ్రులు రామాంజినప్ప, లక్ష్మిదేవి పలు ఆస్పత్రుల చుట్టూ నన్ను తిప్పుతున్నారు. నాపై వారు మమకారాన్ని చంపుకోలేక పోతున్నారు. 2016 ఆగస్ట్‌ 30న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా చికిత్సలకు, అప్పులకుగాను రూ. 8లక్షలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ మొత్తం అందలేదు.
- కురుబ రాధ, ఇంటర్‌ విద్యార్థిని మేకలపల్లి, సోమందేపల్లి మండలం

ఇప్పటికీ కొడుకు ఊహల్లోనే..
ఉన్న ఒక్కగానొక్క కుమారుడు (అశోక్‌) బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ వాడ్ని తలచుకోని ఘడియ అంటూ లేదు. మా కళ్లముందే తిరుగుతున్నట్లు ఉంటుంది. ఫొటో చూస్తే ఇప్పటికీ కళ్లు చెమర్చుతుంటాయి. ప్రతి ఏటా జనవరిన వాడి జ్ఞాపకార్థం కార్యం చేస్తుంటాం. టీచర్‌ కోర్సు పూర్తి చేసిన నా కుమార్తెకు ఉద్యోగం కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
- జయమ్మ, అశోక్‌ తల్లి

కోర్టు చుట్టూ తిప్పుతున్నారు..
కొడుకుపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటిమి. బస్సు ప్రమాదంలో వాడ్ని పొట్టనబెట్టుకుంది. ఆర్టీసీ నుంచి ఇంత వరకూ ఎలాంటి సాయం అందలేదు. ఇంకా కోర్టు చుట్టూ తిప్పుతున్నారు.
- సన్నంజినప్ప, మృత విద్యార్థి నరేంద్ర తండ్రి, మావటూరు, పెనుకొండ మండలం

పరిహారం ఇవ్వలేదు
బస్సు ప్రమాదంలో నాకు రెండు చేతులు విరిగిపోయి నరకం అనుభవించాను. నేను చనిపోతానని నా కుటుంబ సభ్యులు బెంగళూరులో ఓ బ్రిడ్జి కింద నన్ను వదిలేసి వచ్చారు. బెంగళూరు మహా నగర పాలక సంస్థ అధికారులు ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించి వైద్యం చేయించారు. ప్రాణాలతో బయటపడ్డాను. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3 లక్షల పరిహారాన్ని నాకు ఇవ్వలేదు.
- రామాంజినప్ప, చెరుకూరు

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు