వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

15 Sep, 2017 22:28 IST|Sakshi
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

హిందూపురం: హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగాపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవరాయునిపల్లికి చెందిన గర్భిణి నాగరత్న ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరితే వైద్యులు నాలుగు రోజులు చికిత్స చేసి.. బుధవారం రాత్రి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురానికి రెఫర్‌ చేశారు. హుటాహుటిన అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా అదేరోజు అర్ధరాత్రి వైద్యులు సిజేరియన్‌ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఫిట్స్‌ రావడంతో నాగరత్న గురువారం ఉదయం మృతి చెందింది.

శుక్రవారం ఉదయం మృతురాలి తల్లి సిద్దమ్మ, గ్రామస్తులు పురిటిబిడ్డతో వచ్చి హిందూపురం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, పురిటిబిడ్డకు తల్లిని లేకుండా చేశారని శాపనార్థాలు పెట్టారు. బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆస్పత్రి ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ వచ్చి పూర్తివివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. 

మరిన్ని వార్తలు