పల్లెటూర్‌

13 Jan, 2017 02:10 IST|Sakshi
పల్లెటూర్‌

పల్లెబాట పట్టిన నగరం
రైళ్లు, బస్సులు కిటకిట
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీపర్వం
ఏయూలో అలరించిన పండుగ సంబరాలు


పండుగ సెలవులిచ్చేశారు. తెల్లారితే భోగి పండుగ..దాంతో నగరం సొంతూరికి పయనమైంది...   బస్టాండు, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడాయి. క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడి టికెట్లు కొనుక్కొని రైళ్లు, బస్సులపైకి జనం ఎగబడ్డారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా.. రద్దీని అవి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారు దోపిడీకి పాల్పడుతున్నారు. అదిరిపోయే రేట్లతో బెదరగొడుతున్నారు. అయినా సరే ప్రయాణికులు వాటిని ఆశ్రయించక తప్పడంలేదు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో పల్లె వాతావరణం సృష్టించాయి. ధింసా నృత్యాలు.. తప్పెటగుళ్లు.. సంప్రదాయ పిండివంటల ఘుమఘుమలు.. బొమ్మలకొలువులు.. భోగిమంటలు.. ముగ్గుల పోటీలతో ఏయూ మైదానం అచ్చమైన తెలుగు పల్లెను తలపించింది. ఆటపాటలు, పోటీలతో హోరెత్తింది..

విశాఖపట్నం : సంక్రాంతి పండగను సొంత ఊళ్లల్లో జరుపుకోవడానికి నగరం నుంచి భారీ ఎత్తున ప్రజలు ప్రయాణæమవుతున్నారు. సిటీలో పుట్టిపెరిగిన వారు సైతం బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయణమవుతున్నారు. దీంతో గురువారం నగరమంతా సందడి సందడిగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆర్టీసీ 600 రెగ్యులర్, 95 ప్రత్యేక  సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 6 లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీకి గురువారం ఒక్కరోజే రూ.95 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో కంటే ఇది సుమారు రూ.20 లక్షలు అదనం.

రద్దీతో తప్పని తిప్పలు
తాటిచెట్లపాలెం : రైల్వే స్టేషన్, బస్‌ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సంతోషంగా గడపాల్సిన పండగకు వ్యయ ప్రయాసలతో వెళుతున్నారు. దీనికి తోడు ఎప్పటిలాగే రైల్వే శాఖ వేసిన అరకొర రైళ్లతో ప్రయాణంలో సీట్లు రిజర్వుగాక, జనరల్‌లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ ట్రావెల్స్, ఆర్టీసీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. చార్జీల భారాన్ని భరించలేక సాధారణ జనం విసుగు చెందుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు జేబుదొంగలు రద్దీని ఆసరా చేసుకొని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటునట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  

సొంతూరులో సంతోషాలు   
తెలుగు వారి పండగల్లో అత్యంత విశిష్టత కలిగిన సంక్రాంతి పండగను ఎవరికి వారు తమ స్వగ్రామాల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. అందుకే సొంత ఊరికి వెళ్లేది ఏడాదికి ఒక్క సారే అయినా సంక్రాంతికే వెళ్లాలనుకుంటారు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉపాధి కోసం కూడా విశాఖ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంతూరులో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు.

మరిన్ని వార్తలు