పుష్కరాలా.. అమ్మబాబోయ్!

21 Jul, 2015 18:01 IST|Sakshi
పుష్కరాలా.. అమ్మబాబోయ్!

పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు.. అందులోనూ ఈసారి 144 ఏళ్లకు వస్తున్న మహాపుష్కరాలు.. పుణ్యస్నానం చేయకపోతే మహాపాపం అని అందరూ అనడంతో సకుటుంబ సపరివార సమేతంగా పాలకొల్లు వెళ్లా. అక్కడికి వెళ్లడం వరకు బాగానే ఉంది గానీ, తిరిగి వచ్చేటప్పుడే.. చుక్కలు కనిపించాయి. ఏలూరు వరకు వస్తే.. అక్కడ కారు ఉంది. కానీ, ఏలూరు చేరుకోవడమే పెద్ద తపస్సులా అనిపించింది.

పాలకొల్లు నుంచి భీమవరం ప్రయాణం.. మహా అయితే ముప్పావు గంట. కానీ, అప్పటికి దాదాపు రెండు గంటల నుంచి వెయిటింగ్. మామూలుగా అయితే ఐదు నిమిషాలకు ఓ బస్సు వచ్చి వెళ్లేది, ఆ రెండు గంటల్లో వచ్చినవి రెండే బస్సులు. అవికూడా ఫుల్లుగా ఉండటంతో అస్సలు ఆగలేదు. షేర్ ఆటోలు ఉన్నా.. ఒక్కోదాంట్లో అప్పటికే 20 మంది వరకు కుక్కి.. ఇక ఆపలేను బాబోయ్ అంటూ వెళ్లిపోతున్నారు. ఎట్టకేలకు ఒక్క బస్సు ఆగింది. హమ్మయ్య అంటూ కుటుంబంతో కలిసి బస్సు ఎక్కాను. ఆర్టీసీ బస్సులో కూర్చోవడం మాట దేవుడెరుగు.. కాలు పెట్టడానికి కాసింత జాగా దొరికింది.. అదే పదివేలు అనుకున్నాం. పావుగంట గడిచింది.. ఇంతలో ఎక్కడో సీటులోంచి ఓ ఆడగొంతు.. కండక్టర్తో గొడవ పడుతోంది. ఏంటా అని చెవులు రిక్కించి విన్నా.

''నిల్చున్నవాళ్లను అర్జంటుగా దించెయ్యండి.. మాకు గాలి ఆడట్లేదు. అలా తలుపు దగ్గరే అడ్డంగా నిలబడిపోతే మేం గాలి పీల్చుకోవక్కర్లేదా?'' అంటూ కండక్టర్ను గద్దిస్తోంది ఆవిడ. 'అంతమందిని ఎలా దించుతామమ్మా.. కావాలంటే మీరు దిగిపోయి కారులో రండి' అని కండక్టర్ ఆమెకు సమాధానం ఇచ్చాడు. సీట్లో కూర్చున్నవాళ్లను దించుతారా.. ఎంత ధైర్యం.. అంటూ మళ్లీ సదరు మహిళామణి ఒంటికాలి మీద లేచింది.

ఎలాగోలా బస్సు కదిలింది. భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరం ఉందనగా ఉన్నట్టుండి బస్సు ఆగిపోయింది. అలా ఆగడం.. ఆగడం.. దాదాపు ముప్పావు గంట సేపు అలాగే ఉండిపోయింది. ఏంటా అని దిగి బయటకు వెళ్లి చూస్తే, కనుచూపు మేర అంతా ట్రాఫిక్ జామే. పక్కన పెట్రోలు బంకు ఉంటే.. అక్కడున్న ఓ పెద్దమనిషిని బస్టాండు ఎంత దూరం ఉంటుందని అడిగా. ఆ, ఎంత.. రెండు ఫర్లాంగుల లోపే. నడిచి వెళ్లపోవచ్చని చెప్పారు. తీరా నడక మొదలుపెడితే.. రెండు కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. అక్కడ ఏలూరు బస్సు కోసం మరో గంటన్నర వెయిటింగ్.. అదీ దొరక్కపోవడంతో తాడేపల్లిగూడెం బస్సు కనిపించింది. మహాప్రసాదం అనుకుంటూ ఎక్కేసి, గూడెంలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేశా. అప్పటికి సమయం రాత్రి 9.45. ఓ గంటలో ఇంటికి వస్తానని చెప్పా. 11 గంటల సమయంలో గూడెం చేరుకుని, వాళ్ల ఇంటికి వెళ్లేసరికి వాళ్ల భార్య అన్నపూర్ణమ్మలా వేడివేడిగా వంట చేసి పెట్టింది. తినేసి ఏసీలో పడుకుని.. తెల్లారే లేచి ఫస్టు బస్సుకే ఏలూరు వెళ్లడం.. అక్కడ కారు తీసుకుని హైదరాబాద్ బయల్దేరి, మళ్లీ హనుమాన్ జంక్షన్ దగ్గర మూడు గంటల ట్రాఫిక్ జాంలో ఇరుక్కుని.. సాయంత్రం లోపు రావాల్సింది రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్నాం. అంతకుముందు 'డాడీ.. మళ్లీ పన్నెండేళ్లకు గానీ రావట కదా.. నేను పుష్కరాలు చూడాల్సిందే' అంటూ పట్టుబట్టిన నా పదిహేనేళ్ల కూతురు.. మళ్లీ పుష్కరాలు అన్న మాట ఎత్తితే ఒట్టు!!

-కామేశ్వరరావు పువ్వాడ

మరిన్ని వార్తలు