అంత్యపుష్కరాలు ఆరంభం

31 Jul, 2016 20:42 IST|Sakshi
అంత్యపుష్కరాలు ఆరంభం
భరత భూమి వేద భూమి, కర్మ భూమి. ఇక్కడ జనం సృష్టికర్తపై విశ్వాసముంచుతారు. పాపపుణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలలో స్నానమాచరించి పునీతులవుతారు. పుష్కరాలు పూర్తి అయిన ఏడాదికి అంత్య పుష్కరాలు వస్తాయి. పుష్కరాలలో భక్తులు పవిత్ర గోదావరిలో మునిగి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
   వారి ఆత్మల శాంతి కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. వేద పండితులు గోదారమ్మకు మంగళహారతులు ఇస్తారు. రైతు పొలంలో జీవమై నిలచే జలం... సామాన్యుడి దాహం తీర్చే ‘అమృతం’ వరం జలం... పురాణాల్లో, ఇతిహాసాల్లో నదులను దేవతలుగా కీర్తించారు. దేశవ్యాప్తంగా గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు.
        ఈ పుష్కరాల్లో కోట్లాది భక్త జనం భక్తిప్రపత్తులతో పాల్గొంటారు. చెన్నూర్‌లో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కాశీ అంతటి ప్రాశస్త్యం గల పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో భక్తులు భక్తి భావంతో స్నానమాచరించారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు.
     నియోజకవర్గంలోని మండలాలైన కోటపల్లి, జైపూర్, మందమర్రి పట్టణాల నుంచి భక్తులు వచ్చారు. ఉదయం 5 గంటల నుంచే నదీతీరానికి చేరుకొని పూజలు చేశారు. పుష్కరఘాట్‌ వద్ద అధికారులు ఏర్పాట్లను చేశారు. తొలి రోజు వేలాది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. పూజారులు భక్తులచే వారి పూర్వీకులకు పిండప్రదానం చేయించారు. మొదటి రోజు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పుష్కర స్నానం ఆచరించారు. – చెన్నూర్‌
 
 
 

 

మరిన్ని వార్తలు