ఉప ఎన్నికల్లో పోటీకి అప్పుకావాలట!

23 Oct, 2015 21:16 IST|Sakshi
ఉప ఎన్నికల్లో పోటీకి అప్పుకావాలట!

ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడని వరంగల్ ఉప ఎన్నికలో అప్పుడే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక బరిలో దిగుతానని, అందుకుగానూ తనకు రుణం మంజూరు చేయాలని ఓ వ్యక్తి బ్యాంక్ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే..

'జన సంక్షేమ సంఘం' అనే సంస్థకు అధ్యక్షుడైన వెంకటనారాయణ పాతికేళ్ల యువకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తన సంస్థ తరఫునే వరంగల్ ఉప ఎన్నికలో పోటీచేయాలనుకున్నాడు. అయితే డిపాజిట్ చెల్లింపులు, ప్రచార ఖర్చులు తదితర అవసరాలకు సరిపడా డబ్బులు లేవట! దీంతో శుక్రవారం నల్లకుంటలోని కెనరా బ్యాంక్ కు వెళ్లి రుణం మంజూరు చేయండంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు.

చిన్నప్పటి నుంచి సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, రాజకీయ చైతన్యం మెండుగా ఉందని పేర్కొన్న వెంకటనారాయణ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. మరి బ్యాంక్ అధికారులు రుణం ఇస్తానన్నారా? అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు! అటు బ్యాంక్ అధికారులు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకురాలేదు!

మరిన్ని వార్తలు