స్టూడెంట్స్ కోసం వివాహం వాయిదా

16 Aug, 2016 20:39 IST|Sakshi

వెల్దుర్తి: ఆమె తమ విద్యాలయంలో చదివే బాలికలు శిఖరాగ్రాన నిలుచునేందుకు తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 20 మంది బాలికలు కిలిమంజారో పర్వత అధిరోహణకు వెళ్లిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించారు. కాగా, ఈ బృందంలో మెదక్ జిల్లాకు చెందిన 9 మంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థినులు ఉండగా, వీరిలో ఇద్దరు వెల్దుర్తి కేజీబీవీకి చెందిన వారు. ఈ విద్యాలయం పీఈటీ కమల.. తన విద్యార్థినులు కవిత, జ్యోతికి ధైర్యం చెప్పేందుకు, తోడుగా ఉండేందుకు ఆమె వారి వెంట వెళ్లారు.

పర్వత అధిరోహణ కోసం వెళ్లిన వీరంతా ఈ 18న తిరిగి రానున్నారు. పీఈటీ కమల వివాహం అంతకుముందే ఈ 18న చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, అదే రోజున వారు ఇక్కడికి తిరిగి వస్తున్నందున, వివాహానికి తగిన సమయం లేనందున కమల తన వివాహ తేదీని వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 26న మరో ముహూర్తం ఖరారు చేశారు. బాలికల విజయం కోసం వివాహాన్నే వాయిదా వేసుకున్న పీఈటీ కమలను పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు