1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు

21 Oct, 2016 07:57 IST|Sakshi
1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు

రూ.60 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ
మరో రూ.62 వేల కోట్లతో కేజీ బేసిన్‌లో క్రూడాయిల్ వెలికితీత
పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విశాఖలో పెట్రో యూనివర్సిటీకి శంకుస్థాపన
ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం

 
 సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగానికి రూ.లక్షా 22 వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వీటిలో రూ.62 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ, మరో రూ.60 వేల కోట్లతో కేజీ బేసిన్‌లో క్రూడాయిల్ వెలికితీతకు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో రూ.600 కోట్లతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రో యూనివర్సిటీ)కి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
 
 అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పెట్రో యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, డిసెంబర్‌లో హెచ్‌పీసీఎల్ విస్తరణకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు విదేశాల్లో పెట్రో రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికల్లా రాష్ట్రంలో ప్రధాని ఉజ్వల్ యోజన కింద అందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు నేషనల్ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి ధర్మేంద్ర జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాని ఉజ్వల్ యోజన పథకాన్ని ఇక్కడినుంచే   ప్రారంభించారు.
 
 ప్యాకేజీని సమర్థిస్తున్నా: చంద్రబాబు
 రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని సమర్థించడమే కాదు, అందుకు కారకుడైన వెంకయ్యనాయుడిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రంలో అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వరకు పెట్రో హబ్‌గా తయారవుతుందని చెప్పారు. ఏపీలో రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రధాని మోదీ ఘనతేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికిచ్చే సొమ్ము పాచిపోదని, చట్టవిరుద్ధంగా దాచుకున్న సొమ్మే పాచిపోతుందని వ్యాఖ్యానించారు.  
 
 వైఎస్ హయాంలోనే స్థల పరిశీలన
 పెట్రోవర్సిటీకి విశాఖలో శంకుస్థాపన చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు వర్సిటీని తీసుకురావడం తమ ప్రభుత్వాల ఘనతగా చెప్పుకున్నారు. కానీ వాస్తవాలు చూస్తే.. దివంగత  వైఎస్‌ఆర్ హయాంలోనే విశాఖలో ఐఐఎం, రాజమండ్రిలో పెట్రో వర్సిటీ ఏర్పాటుచేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరగా  సుముఖత  వ్యక్తంచేసింది. 2013లోనే కేంద్ర  ఉన్నతాధికారుల బృందం స్థల పరిశీలన  చేసింది. తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం భవన సముదాయాలను  పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా రాజమండ్రిలోనే పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తొలి బడ్జెట్‌లో ఇందుకు తూర్పు గోదావరి జిల్లా పేరే ప్రతిపాదించారు.  ఆ తర్వాత స్థలాలు అందుబాటులో లేవంటూ విశాఖకు ప్రతిపాదించారు.
 

మరిన్ని వార్తలు