ఖతర్నాక్ చోరీ!

3 Jul, 2016 20:07 IST|Sakshi
ఐవోసీ పైపు లైనుకు రధ్రం వేసి చమురు చోరీకి బిగించిన చిన్న పైపు

ఐవోసీ పైపునకు కన్నం వేసి డీజిల్, పెట్రోలు అపహరణ
పొలం లీజుకు తీసుకుని అక్కడ నుంచి రవాణా
ఆలస్యంగా గుర్తించిన అధికారులు
తరలిపోయిన ఇంధనం   విలువ రూ. కోట్లలో..

 
గంగవరం(చిత్తూరు జిల్లా) : చెన్నై నుండి బెంగళూరుకు వెళుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పైపులైనుకు కన్నం వేసి డీజల్, పెట్రోలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని పొన్నమాకులపల్లెలో ఈ వ్యవహారం బయటపడింది. రెండు నెలలుగా ఐవోసీ అధికారులు మండల పరిధిలో ఎక్కడో గ్యాస్ లీక్ అవుతోందని భావించి గాలించారు. ఎక్కడా బయట పడక పోవడంతో జాతీయ రహదారి పక్కనే పొన్నమాకులపల్లెకు చెందిన క్రిష్ణప్ప అనే రైతు పొలంలో వెళుతున్న పైపులైన్‌ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. దీంతో అసలు విషయం బయట పడింది.

పైపుకు కన్నం వేసి దాన్నుంచి పైపు వేసి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పట్టుపురుగుల షెడ్డులో ఆయిల్ బేరళ్ళు అమర్చి వాటిని నింపేవారు. అక్కడి నుండి లారీల ద్వారా బయటికి తరలిస్తున్నారని గుర్తించి విస్మయం చెందారు. మూడు నెలల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తులు పొలం లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటామని క్రిష్ణప్ప వద్ద ఒప్పందం చేసుకొన్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన వ్యక్తుల వివరాలు తెలియలేదు. శుక్రవారం పొలం యజమాని వద్ద ఐవోసీ అధికారులు అనుమతి తీసుకొని పైపులైనును పరిశీలించారు. విషయం తెలుసుకున్న  పొలం లీజుకు తీసుకొన్న వ్యక్తి, పొలం యజమాని మెల్లగా జారుకున్నారు.  ఐవోసీ అధికరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలం చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేయడానికి చర్యలు తీసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తులు మూడు నెలల క్రితం పొలాన్ని వ్యవసాయం కోసం లీజుకు తీసుకొన్నారు. అప్పటి నుండి ఈతతంగం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రూ. కోట్ల మేర అక్రమ వ్యాపారం జరిగి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నుండి ట్యాంకర్ల ద్వారా అక్రమ రవాణా జరిగిందని అధికారులు అంటున్నారు. ఐవోసీ పైపులైనుకు కన్నం వేసే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే సుమారు 15కి.మీ మేర పైపులైను, ఆస్తి నష్టం జరిగి ఉండేది. గంటకు 250 కి.మీ. స్పీడుతో ఇందనం తరలివెళ్తుందనీ ఐవోసీ అధికారులు తెలిపారు. ఐఓసీ (చెన్నై) సీనియర్ మేనేజరు సత్యనారాయణ దీనిపై స్పందిస్తూ డీజల్, పెట్రోలు చోరీ జరిగింది వాస్తమేనన్నారు. ఎంత మేరకు చోరీ జరిగిందనే విషయం తెలుసు కోవడానికి సమయం పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు