తొలిరోజే పేలిన పెట్రో బాంబు

1 Jan, 2017 23:43 IST|Sakshi
  • పెట్రోల్‌పై రూ.1.29, డీజిల్‌పై 97 పైసల పెంపు
  • అర్ధరాత్రి నుంచే అమల్లోకి..
  • జిల్లాపై రూ.4.26 కోట్ల భారం
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా మునిగి ఉన్న ప్రజలపై.. మోదీ ప్రభుత్వం ఈ ఏడాది తొలి రోజే పెట్రోలు, డీజిల్‌ ధరల భారం మోపింది. పెట్రోల్‌ లీటరుకు రూ.1.29, డీజిల్‌ 97 పైసల చొప్పున పెంచేసింది. పెరిగిన ధరలు ఒకటో తేదీ అర్ధరాత్రి నుం చే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో నిన్నటివరకూ రూ.74.40గా ఉన్న లీటర్‌ పెట్రోలు ధర రూ.75.69కు, డీజిల్‌ ధర రూ.63.07 నుంచి రూ.64.04కు పెరిగాయి. ఈ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం వేసే     పన్ను అదనం. జిల్లాలో ఉన్న 251 పెట్రోలు బంకుల్లో ప్రతి రోజూ దాదాపు 5 లక్షల లీటర్ల పెట్రోల్, 8 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్‌ వినియోగదారులపై రోజుకు రూ.6.45 లక్షలు, నెలకు రూ.1,93,50,000 భారం పడనుంది. డీజిల్‌ వినియోగదారులపై రోజుకు రూ.7.76 లక్షలు, నెలకు రూ.2,32,80,000 భారం పడుతోంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో మొత్తం మీద జిల్లా వినియోగదారులపై రోజుకు రూ.14.21 లక్షలు, నెలకు రూ.4,26,30,000 మేర అదనపు భారం పడనుంది.
    గతంలో పెరిగిందిలా..
    గత ఏడాది సెప్టెంబర్‌ 1న రూ.65.17గా ఉన్న పెట్రోలు ధరను డిసెంబర్‌ ఒకటికి రూ.71.40కి, డిసెంబర్‌ 15నాటికి రూ.74.40కు పెంచగా.. తాజా పెంపుతో ఈ ధర రూ.75.69కు చేరింది. అలాగే సెప్టెంబర్‌ 1న రూ.56.33గా ఉన్న డీజిల్‌ ధర డిసెంబర్‌ ఒకటికి రూ.60.86కు, డిసెంబర్‌ 15కు రూ.63.07కు పెరగ్గా.. తాజా పెంపుతో రూ.64.04కు చేరింది.
     
మరిన్ని వార్తలు