’పెట్రో’ వాత

16 Dec, 2016 23:38 IST|Sakshi
’పెట్రో’ వాత
డీజిల్, పెట్రోల్‌ ధరల పెంపుతో జిల్లాపై నెలకు రూ.12.70 కోట్ల భారం
ఏలూరు సిటీ :
పెద్దనోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుతో మరో భారం మోపింది. నల్లధనాన్ని వెలికితీయటం ద్వారా పన్నులు, పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గిస్తుందనే అంచనాలకు తారుమారు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.21, డీజిల్‌పై రూ.1.79 పెంచింది. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.71.86 ఉండగా, తాజా పెంపు రూ.2.21, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి లీటర్‌ ధర రూ.74.47 వరకు పెరిగింది. జిల్లాలో డీజిల్‌ లీటర్‌ ధర రూ.61.35 కాగా, తాజాగా పెరిగిన రూ.1.79, పన్ను సుమారు రూ.40 పైసలు కలిపి రూ.63.35 వరకు ఉంది. 
 
 జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల భారం
పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుతో జిల్లా వాసులపై నెలకు రూ.12.70 కోట్ల అదనపు భారం పడనుంది. జిల్లాలో పెట్రోల్‌పై పన్నులతో కలుపుకుని లీటరుకు రూ.2.61 అదనపు భారం పడుతోంది. జిల్లాలో రోజుకు 7 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండగా, ధర పెరగడంతో అదనంగా రూ.18.27 లక్షలు, నెలకు రూ.5.48 కోట్లు మేర అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలో రోజుకు 11 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నారు. పెరిగిన డీజిల్‌ ధర పన్నులతో కలుపుకుని రూ.2.19 కాగా, వినియోగదారులపై సుమారు రూ.24 లక్షలు, నెలకు రూ.7.22 కోట్లు మేర అదనపు భారం పడనుంది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉండగా, ట్రక్‌ ఆటోలు 26,415, కార్లు 32 వేలు ఉన్నాయి. జిల్లాలో హెచ్‌పీసీ పెట్రోల్‌ బంకులు 44, బీపీసీ బంకులు 47, ఐఓసీ 101, ఇతర కంపెనీలకు చెందిన బంకులు 16 వరకు ఉన్నాయి.
 
బాలిక, నాయనమ్మ, హిందూ సంప్రదాయం
 
టి.నరసాపురం :
ఎవరైనా మరణిస్తే కుమారుడు తలకొరివి పెట్టడం హిందూ సంప్రదాయం. వారసులు ఎవరూ లేకపోవడంతో నాయనమ్ మృతదేహానికి మనుమరాలే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బందంచర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వీరంకి వెంకాయమ్మ (48) అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. వెంకాయమ్మ భర్త గతంలోనే చనిపోయారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, కుమారుడు మధు 2002లో ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికి అతని భార్య రాధ గర్భిణి. తండ్రి మరణానంతరం జన్మించిన కుమార్తెకు హిమశ్రీగా నామకరణం చేశారు. హిమశ్రీ, ఆమె తల్లి రాధ బొర్రంపాలెంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. హిమశ్రీ అదే గ్రామంలో 9వ తరగతి చదువుతోంది. బాలిక నాయనమ్మ వెంకాయమ్మ శుక్రవారం మరణించగా, వారసులెవరూ లేకపోవడంతో ఆమె మనుమరాలు హిమశ్రీ ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపించింది.
 
మరిన్ని వార్తలు