పీఎఫ్‌.. ఉఫ్‌!

1 Aug, 2016 01:24 IST|Sakshi
– ఈఎస్‌ఐ డబ్బులూ అంతే..
– రూ.20లక్షల చెల్లింపుపై అయోమయం 
– ఇదీ గద్వాల మున్సిపాలిటీ తంతు 
 గద్వాల : గద్వాల మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల భవిష్యనిధి(పీఎఫ్‌), కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) డబ్బుల జమపై అయోమయం నెలకొంది. ఏళ్లుగా జమకాకపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పీఎఫ్‌ కార్యాలయానికి చెల్లించిన డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ కాకపోకపోవడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు మున్సిపాలిటీ ఏడాది కాలంగా పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించడంలేదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను విడుదల చేస్తారు. అయితే అధికారులు వేతనాలను మాత్రం చెల్లిస్తూ... కొన్ని నెలలకు సంబంధించిన  పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులను మాత్రం సంబంధిత శాఖలకు జమ చేయడంలేదు. రెగ్యులర్‌గా కమిషనర్‌లు ఉండకపోవడం వలన ఎవరికి వారు తమ హయాంలోని వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించడం జరుగుతూ వచ్చింది. బకాయిపడిన డబ్బుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయా శాఖల నుంచి ఎప్పటికప్పుడు మున్సిపాలిటీకి నోటీసులు అందుతున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ అధికారులు మాత్రం పొరపాటు తమ దగ్గర జరగలేదని పీఎఫ్‌ కార్యాలయంపైకి నెట్టుతున్నారు.
ఇదీ పరిస్థితి... 
గద్వాల మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో మొత్తం 205 కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనం కింద రూ.15లక్షలు చెల్లిస్తున్నారు. పీఎఫ్‌ కింద రూ.1.50లక్షలు, ఈఎస్‌ఐ కింద రూ.82వేలు మున్సిపాలిటీ చెల్లిస్తుంది. ఆయా మొత్తాలను ప్రతి నెలా కార్మికుల ఖాతాల్లో జమచేసి సంబంధిత ధ్రువపత్రాలను చూపిస్తేనే మరుసటి నెల డబ్బులను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అధికారులు తమ హయాంలో చూపిన నిర్లక్ష్యం కారణంగా పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు జమకాలేదు. దీనిపై ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కొంతకాలానికి తమ పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు గల్లంతయ్యాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 
జమకాని డబ్బులు... 
గద్వాల మున్సిపాలిటీలో 2011నుంచి కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐని వర్తింపజేస్తున్నారు. 2014 జూలై నుంచి 2015 ఏప్రిల్‌ వరకు రూ.11లక్షల ఈఎస్‌ఐ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా కమిషనర్‌ ఖాతాలో జమ చేశారు. 2015 మే నుంచి 2016 మార్చి వరకు ఈఎస్‌ఐ డబ్బులు కార్మికుల వేతనాల నుంచి తీసుకున్నారు. అయితే అవి ఎక్కడ జమ చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2015 మార్చి నుంచి 2015 నవంబర్‌ వరకు ఉన్న రూ.26లక్షల పీఎఫ్‌ డబ్బులను కమిషనర్‌ ఖాతాలో జమచేశారు. 2015 డిసెంబర్‌ నుంచి 2016 మార్చి వరకు పీఎఫ్‌ కింద కార్మికుల వేతనాల నుంచి తీసుకున్నారు. అయితే అవి ఎక్కడ జమ అయ్యాయన్నది అధికారులు తెలియజేయాల్సి ఉంది. 2012 ఏప్రిల్‌ నుంచి 2012 సెప్టెంబర్‌ వరకు కార్మికులకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్‌ఐలకు సంబంధించిన రూ.20.43లక్షల డబ్బుల జమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో ఉన్న అధికారులు కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో సంబంధితశాఖల నుంచి మున్సిపాలిటీకి నోటీసులు రావడంతో 2015లో అప్పటి కమిషనర్‌ స్పందించి డబ్బులు జమ చేశారు. కానీ పీఎఫ్‌ అధికారులు నిర్లక్ష్యం వల్ల పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ కాలేదు. రూ.20.43లక్షల జమపై ఇప్పటికీ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తాము మాత్రం పీఎఫ్‌ కార్యాలయానికి డి.డి రూపంలో డబ్బులు జమ చేశామని, పీఎఫ్‌ అధికారుల జాప్యం కారణంగానే కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయనే దానిపై విచారణ చేపట్టాల్సి ఉంది. 
 
కార్మికులు నష్టపోతున్నారు...
– వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి 
పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల కార్మికులు పొందాల్సిన బెనిఫిట్స్‌ పొందడం లేదు. ఇప్పటికే చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఎలాంటి పరిహారం అందలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు నష్టపోతున్నారు. ఈఎస్‌ఐ అమలవుతున్నా డబ్బులు జమ కాకపోవడం వల్ల కార్మికులు వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే కార్మికుల ఖాతాల్లో డబ్బులను జమ చేయాలి. 
 
డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం 
– గోపయ్య, ఇన్‌చార్జి కమిషనర్‌ 
 కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 2012లో కార్మికులకు సంబంధించిన డబ్బులను డీడీ రూపంలో పీఎఫ్‌ కార్యాలయానికి జమ చేశాము. అక్కడ కొంత జాప్యం జరిగింది. వాటి వివరాలను తెలుసుకొని పరిష్కరిస్తాం. డబ్బులు జమ కాకపోవడానికి ఆన్‌లైన్‌ ఖాతాల్లో సమస్యలు ఉన్నాయి.  
మరిన్ని వార్తలు