ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు..

13 Feb, 2017 22:33 IST|Sakshi
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు..
ఫిజిక్స్‌పై భయాన్ని పోగొట్టేందుకు పరీక్షలు
ప్రత్యేక సైన్స్‌స ఫోరం ఏర్పాటు 
 
భౌతికశాస్త్రం అంటే చాలామంది విద్యార్థులకు భయమే. ఇది ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే ఏపీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్స్‌ ఫోరమ్‌ (ఏపీపీఎస్‌టీఎఫ్‌) ఏర్పాటు చేశారు. ఈ ఫోరం ద్వారా పదో తరగతి విద్యార్థుల్లో ఫిజిక్స్‌పై  భయాన్ని పోగొట్టి.. ఆసక్తిని పెంచేందుకు ఈనెల 19న  ప్రత్యేక పోటీ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఇన్‌ఛార్జి డీఈఓ అబ్రహం గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారు.   
 – రాయవరం 
19న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు..
జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ఈ పరీక్షను ఈ నెల 19న నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం నుంచి ఇద్దరు చొప్పున ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒకే మీడియం ఉంటే నలుగురు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు డివిజన్‌ కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని అధ్యాయాల నుంచి, సీసీఈ విధానంపై ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 
పరీక్షా విధానం..
60 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఈ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం డివిజన్‌ కేంద్రాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి జిల్లాస్థాయిలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తారు.  డివిజన్‌ కేంద్రాల్లో కూడా ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 10 గ్రేడ్‌ సాధనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందింది. ఈ ఏడాది కూడా ఇదే రీతిలో ఫలితాల సాధనకు ఈ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 
సద్వినియోగం చేసుకోవాలి 
ఈ నెల 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిజికల్‌ సైన్స్‌ ఫోరమ్‌ ద్వారా ఈ పోటీలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షను సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్‌ఛార్జి డీఈఓ అబ్రహం ఈ పరీక్ష నిర్వహించే తీరును తెలుసుకుని ప్రోత్సహించడం సంతోషం. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు 81795 18749కు సంప్రదించాలి. 
– సత్యవోలు శ్రీనివాస్, కాకినాడ
>
మరిన్ని వార్తలు