విలీన విద్య.. వికలాంగులకు వరం

10 Sep, 2016 18:25 IST|Sakshi
ఐఈడీ కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు
  • పేట ఐఈడీ కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు
  • పెద్దశంకరంపేట: విలీన విద్య.. వికలాంగ విద్యార్థుల పాలిట వరంగా మారింది. మూడేళ్ల క్రితం పేట మానవ వనరుల కేంద్రం ఆవరణలో నూతనంగా ఐఈడీ కేంద్రాన్ని నిర్మించారు. మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 80 మందికి పైగా వికలాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మానసిక వికలాంగ విద్యార్థులు కూడా ఉన్నారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

    వినికిడి లోపం, బుద్ధిమాంద్యం, బహుళ వైకల్యం తదితర లోపాల విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇద్దరు ఐఈడీ ఉపాధ్యాయులను కూడా నియమించారు. ఆయా పాఠశాలల నుంచి వచ్చే వికలాంగ విద్యార్థులకు చదువుతో పాటు ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నారు.

    వీరికి మధ్యాహ్న భోజనాన్ని కూడా సమకూరుస్తున్నారు. వీరు పాఠశాలకు వచ్చేందుకు ప్రతి నెల రవాణా భత్యాన్ని చెల్లిస్తున్నారు. ఈ విధానంపై గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆర్వీయం ద్వారా విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం వికలాంగల పరిరక్షణ చట్టాన్ని రూపొందించి సంక్షేమ పథకాలు, అన్ని రకాలా ఉచిత సేవలందిస్తోంది.

    క్రీడా పరికరాలను కూడా మంజూరు చేసింది. దీంతో మానిసక, శారీరక వికలాంగ విద్యార్థులకు విలీన విద్య ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గతంలో కూడా మండల స్థాయిలో విద్యార్థులకు కంటి, చెవి తదితర సంబంధిత పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ కేంద్రం ద్వారా వికలాంగులు, మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తుండడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు