ప్రగతికి బాటలు వేస్తా

12 Jul, 2016 03:55 IST|Sakshi
ప్రగతికి బాటలు వేస్తా

పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
పాలనా సౌలభ్యం కోసమే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు
మౌలిక సౌకర్యాలతో పాటు అన్నిరంగాల అభివృద్ధిపై ద్రుష్టి

మణుగూరు : ‘అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తా. మణుగూరు పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తా. అత్యంత వెనుకబడిన గుండాల మండలాన్ని రోడ్ల నిర్మాణంతో ప్రగతి పథం పట్టిస్తా. పాలనా సౌలభ్యం కోసమే నియోజకవర్గంలో ఆళ్లపల్లి, కరకగూడెంలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించాం. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉంటాను. మండలాల వారీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాను. ’ అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

రెండేళ్లలో అభివృద్ధిపై...
మొదటి శాసనసభ సమావేశాల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావించాను. సీఎంతో అనేకసార్లు మాట్లాడి రూ.7,250 కోట్ల థర్మల్ ప్లాంటు సాధించా. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 307 చెరువులను రూ.82 కోట్లతో అభివృద్ధి చేశా. మరో నెల రోజుల్లో బూర్గం పాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ఎడమ కాలువ పనులు పూర్తి కానున్నాయి. మణుగూరుకు 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.3కోట్ల సీడీపీ నిధులతో సీసీరోడ్లు,డ్రెయిన్లు, బోర్లు వేయించా. బూర్గంపాడు-ఏటూరునాగారం రహదారిని జాతీయ రహదారిగా మార్పించా.

త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వైద్య, ఆరోగ్య మంత్రితో మాట్లాడి ఆళ్లపల్లి, పినపాక, బూర్గంపాడు పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు మంజూరు చేయించా. మణుగూరు మండలం పేరంటాలచెరువుకు రూ.కోటి మంజూరు చేయించా. టెండర్లు  పిలి చారు. వర్షాకాలం తరువాత పనులు ప్రారం భమవుతాయి. మిషన్‌భగీరథ ద్వారా 2017 డిసెంబర్‌కు నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు నల్లా నీరు వస్తుంది. మొండికుంట, ఆళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేయించా. పినపాక మండలం మల్లారం, అశ్వాపురం, బూర్గం పాడు, గుండాల మండలం మర్కోడుల్లో రూ.5.5 కోట్లతో వ్యవసాయ గిడ్డంగులు మంజూరు చేయించా. రూ.2 కోట్లతో అంగన్‌వాడీ భవనాలు కట్టించా. రూ.8.50 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు వేయించా. రూ.2.23 కోట్లతో మణుగూరులో మినీ ట్యాంక్‌బండ్ మంజూరు చేయించా.

నీటిపారుదల, వ్యవసాయంపై..?
నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. వచ్చే విడత మిషన్ కాకతీయలో అన్ని చెరువులు పూర్తి చేయిస్తా. పినపాక మండలంలో 28 గిరిజన గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.90కోట్ల అంచనాతో పులుసుబొంత ప్రాజెక్టు నిర్మించేందుకు కృషి చేస్తున్నా. దీనిపై శాసనసభలో, సీఎంతోనూ మాట్లాడా. అటవీ, రెవెన్యూ, శాటిలైట్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది నిధులు మంజూరు అవుతాయి.

పినపాక మండలం గొడుగుబండ వద్ద 900ఎకరాలకు సాగునీరు అందించే రూ.9కోట్ల వట్టివాగు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరిపై పినపాక మండలం భూపతిరావుపేట, చింతలబయ్యారం, మణుగూరు మండలం అన్నారం లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు పంపా. వీటితో ఆరువేల ఎకరాలు సాగులోకి వస్తాయి.  సమితిసింగారం పరిధిలో 2వేల ఎకరాలకు నీరందించే రేగులగండికి రూ.1.10 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడీఏ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం మణుగూరుకు మార్చడంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలు అయ్యేలా చేశా.

విద్య, వైద్యంపై...?
నియోజకవర్గానికి ఒక ఎస్సీ, మరొక ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించా. ఇందులో 5 నుంచి ఇంటర్ వరకు బోధిస్తారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, పాలి టెక్నిక్ కళాశాలలకు ప్రతిపాదనలు పంపా. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు సాధించా. సీహెచ్‌సీ వైద్యులు క్షేత్రస్థాయి శిబిరాలు పెట్టకుండా అంబులెన్స్‌లు ఆగిపోయాయి. మొండికుంట, బూర్గంపాడు, మణుగూరుల్లో కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదనలు పంపా.

రోడ్డు కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిపై...?
బూర్గంపాడు-ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేశా. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరువాగు, ఏడుమెలికలవాగులపై వంతెనలు, శాశ్వత రోడ్ల కోసం కృషి చేస్తున్నా. గుండాల-సాయనపల్లి-దామెరతోగు, చెట్టుపల్లి-కొమరారం రోడ్లు పీఆర్ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించాం. దీనికి మంత్రి తుమ్మల ఇచ్చిన సహకారం మరువలేనిది. గొల్లగూడెం-చొప్పాల వంతెనకు రూ.4.5 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ బ్రిడ్జి కమ్ చెక్‌డ్యాం నిర్మిస్తాం.

మారుమూల ప్రాంతాలు..?
మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నా.  కొత్తగా గుండాల నుంచి ఆళ్లపల్లి, పినపాక నుంచి కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలని భౌగోళిక వివరాలతో సీఎంను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు.

మణుగూరు పట్టణ అభివృద్ధిపై..?
మణుగూరులో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి తుమ్మల సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నా. ఇప్పటికే నాయుడుకుంట మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.2.23కోట్లు మంజూరు చేయించా. మరో రూ.3.30కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చా. చినరావిగూడెం-పర్ణశాల మధ్య గోదావరిపై వంతెన కోసం రూ.150కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు