'ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు'

4 Mar, 2017 23:21 IST|Sakshi
'ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు'
 మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే
 
మాచర్ల : రాష్ట్రంలో ప్రజల అభిమానంతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ ప్రభుత్వం నిత్యం ఆయనపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) విమర్శించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి 11 మంది మృతి చెందితే వెంటనే స్పందించి జగన్‌ అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. దీన్ని సహించలేక జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మీడియాకు సంబంధించి ఏ వార్త వచ్చినా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రాజీ పడటం దారుణమన్నారు. శనివారం అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించే వరకూ కూడా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు విమర్శలు రావడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారని తెలిపారు. 

అక్రమ కేసుల నమోదులో ముందంజ
పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పక్షం చెప్పిందే వేదంగా భావిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడంలో ముందంజలో ఉండడం బాధాకరమన్నారు. అధికారమనేది శాశ్వతం కాదనే విషయాన్ని ఆయా శాఖల అధికారులు మర్చిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి చిట్టా సేకరిస్తున్నామని,  ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పీఆర్కే తెలిపారు. 
మరిన్ని వార్తలు