మెచ్చిన వారికి.. నచ్చిన చోట

20 Dec, 2016 00:34 IST|Sakshi
మెచ్చిన వారికి.. నచ్చిన చోట
డీసీ నియామకంపై పైరవీలు  
రూ. కోట్లలో పలుకుతున్న పీఠం  
అధికార నేతల హస్తలాఘవం  
నిబంధనలన్నీ బుట్టదాఖలు
 
ప్రజలంటే భయం లేదు. ఎందుకంటే ఓట్ల సమయంలో నోట్లు ఇచ్చి కొనుక్కోవచ్చుననే ధీమా. మళ్లీ ఎలాగోలా అధికారంలోకి వస్తామనే ధైర్యం. పోనీ దేవుడంటే భక్తి ఉందా అంటే... ఆ భగవంతుడికి భక్తితో భక్తులు ఇచ్చే కానుకల్లోనే వాటాలు పంచుకునే నీచ సంస్కృతి జిల్లాలో నడుస్తోంది. ఇదే అవకాశంగా నిబంధనలు బుట్టదాఖలు చేస్తూ పైరవీలకు పెద్దపీట వేసి పీఠాలను కొంతమంది చేజిక్కించుకుంటున్నారు..
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమాత్యుల అండదండలుంటే సీనియార్టీతో పనేముంది. ఉన్నతాధికారుల ఆశీస్సులుంటే కోరుకున్న పోస్టు కోరుకున్నచోటే వచ్చేస్తుంది. నిబంధనలకు పాతరేసి నచ్చిన వారికి మెచ్చిన పోస్టులు కట్టబెట్టడం పలు శాఖల్లో కొత్తేమీ కాదు. అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికేసిన అమలాపురం డీఎల్‌పీఓ శర్మను జిల్లా పంచాయతీ అధికారిగా నియమించి ప్రజాప్రతినిధులు చేతులు కాల్చుకున్నారు. ఏసీబీ కోర్టులో అతనిపై కేసు పెండింగ్‌లో ఉన్నా ముడుపులు మెక్కేసిన నేతలు అడ్డగోలుగా పోస్టింగ్‌ ఇప్పించేశారు. చివరకు అతని పనితీరు సక్రమంగా లేక కలెక్టర్‌ ఆగ్రహానికి గురై డీఎల్‌పీఓగా తిప్పి పంపించేశారు. అప్పుడు డీఎల్‌పీఓ శర్మ విషయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే ఇప్పుడు కూడా అదే తప్పు దేవాదాయశాఖ డీసీ నియామకం విషయంలో చేశారంటున్నారు.
కోట్ల ఆదాయం... అందకే...
కాకినాడ కేంద్రంగా డిప్యుటీ కమిషనర్‌ పోస్టుకు దేవాదాయ శాఖలో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. వెయ్యికి పైబడి దేవాలయాలతో పాటు కోట్లాది రూపాయలు విలువైన సత్రాలు ఈ డీసీ పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టు కోసం గతంలో జిల్లాలోనే కోటి రూపాయలు చేతులు మారిన సందర్భాలు కూడా లేకపోలేదు. అటువంటి డీసీ పోస్టు రెండు నెలల క్రితం చందు హనుమంతురావు పదవీ విరమణతో ఖాళీ అయింది. ఈ పోస్టులో డీసీని నియమించాలంటే ఆ క్యాడర్‌ ఉన్న ఆలయాలు జిల్లాలో లేవు. అలాగని డీసీ పోస్టును ఖాళీగా ఉంచడం కూడా కుదరదు. అందుకేనేమో రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రమేష్‌బాబును డీసీగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఎసీ) నియమించారు. 
సీనియర్లున్నా...
డీసీ పరిధిలో ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో  సీనియర్లయిన అసిస్టెంట్‌ కమిషనర్లు డజనకు పైబడే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును పరిగణనలోకి తీసుకోకుండా సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల అండదండలుండటంతోనే రమేష్‌బాబును అడ్డగోలుగా నియమించేశారనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జిల్లాలో ఉన్న అసిస్టెంట్‌ కమిషనర్లను పరిశీలిస్తే...పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయ ఈఓ ఆర్‌.పుష్పనాధం, మందపల్లి శనీశ్వరాలయ ఘో దేవుళ్లు, రాజమహేంద్రవరం హితకారిణి సమాజం ఈఓ పి.సుబ్రహ్మణ్యం, తలుపులమ్మ లోవ దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌...వీరు నలుగురు రమేష్‌బాబు కంటే సీనియర్లుగా ఉన్నారని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు జిల్లాలను కూడా చూసుకుంటే మరో పాతిక మందివరకు సీనియర్లున్నారు.అటువంటప్పుడు సీనియర్లను పక్కనపెట్టేసి రమేష్‌బాబును నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాక సంబంధిత శాఖలో తలలుపట్టుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్‌ 339 ప్రకారం చూసుకుంటే అసిస్టెంట్‌ కమిషనర్‌ నుంచి డిప్యుటీ కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వాలంటే 13 జిల్లాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్ల సీనియారిటీని  పరిగణనలోకి తీసుకోవాలి. 
నిబంధనలూ బుట్టదాఖలే...
సీనియారిటీ పక్కనబెట్టేయడం మాట అటుంచి గెజిటెడ్‌ పోస్టుల భర్తీలో సొంత జిల్లాల వారిని నియమించకూడదనే నిబంధనను కూడా బుట్టదాఖలు చేశారు. ఆమాత్యుని అండదండలుంటే చాలు నిబంధనలు వర్తించవా అని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే డిప్యుటీ కమిషనర్‌ పోస్టు కోసం కోటి రూపాయలకుపైనే డీల్‌ కుదిరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచనలమైంది. అప్పట్లో లోవ దేవస్థానం ఈఓ గాది సూరిబాబు రాజు ఈ పోస్టింగ్‌ కోసం ఒక మంత్రి సోదరుడు ద్వారా కోటికి బేరం కుదుర్చుకుని అరకోటి అడ్వాన్సుగా సమర్పించుకున్నాడు. అడ్వాన్సు తీసుకున్న ఆ అమాత్యుని ’తమ్ముడు’ ప్రయత్నించినా చివరకు విశాఖ కనక మహాలక్ష్మి ఈఓగా పనిచేస్తున్న భ్రమరాంబ (ప్రస్తుతం శ్రీకాళహస్తి ఈఓ)కు  సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. అనంతరం ఆ తెలుగు తమ్ముడు తీసుకున్న అరకోటి అడ్వాన్సు తిరిగి ఇవ్వకపోవడం, అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఈఓ సూరిబాబు రాజు మృతి చెందారు. అంతటి డిమాండ్‌ ఉన్న ఈ పోస్టుకు నిబంధనలు తుంగలోకి తొక్కి ఎఫ్‌ఏసీగా నియమించారంటే అసలు ఏమి జరగకుండా ఉండి ఉంటుందా అని ఆ శాఖలోనే పలువురు ప్రశ్నిస్తున్నారు. 
అమాత్యుడి ఆశీర్వాదం...
ఈ పోస్టు భర్తీ చేసేటప్పుడు ఆ శాఖలో ఏసీలుగా పనిచేస్తున్న వారిలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధన. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అండదండలు దండిగా ఉండటంతో సీనియార్టీని బుట్టదాఖలుచేసి రమేష్‌బాబును అడ్డగోలుగా అందలమెక్కించారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజులుగా ఆ శాఖలో పెద్దగా చర్చకు రాని డీసీ నియామకంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేవాలయాల హుండీల్లో పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ అంశం కూడా తెర మీదకు వచ్చింది.
 
మరిన్ని వార్తలు