మాకో పదవి

17 Mar, 2016 04:05 IST|Sakshi
మాకో పదవి

నామినేటెడ్ పదవులపై గులాబీ నేతల ఆశలు
ఖమ్మం మార్కెట్, భద్రాచలం ట్రస్ట్‌బోర్డు పైనే గురి
కోర్టు పరిధిలో  ఏజెన్సీలోని నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీలు
మిగతా పోస్టులపై చిన్నాచితక నేతల పైరవీలు
‘మంత్రాంగం’తోనే పదవులు దక్కుతాయని నేతల ధీమా

మార్కెట్ కమిటీలు 9
ఖమ్మం, నేలకొండపల్లి, కొత్తగూడెం, చర్ల, వైరా, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, మధిర

ఆలయ ట్రస్ట్ బోర్డులు600
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాల్వంచ  పెద్దమ్మతల్లి దేవాలయాలే ఆదాయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ -1


సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ముగిశాయి. పాలేరు ఉపఎన్నిక మినహా ఏ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటి వరకు ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవులు ఈసారైనా భర్తీ చేస్తారనే ఆశతో పలువురు నేతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆదాయం ఎక్కువగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ బోర్డులపైనే ప్రధాన నేతలంతా గురి పెట్టారు.  జిల్లా మంత్రి కనుసన్నల్లోనే పదవులు  భర్తీ అయ్యే అవకాశముందని, ఆయనతోనే మంత్రాంగం చేసి పదవులు దక్కించుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మునిగారు. జిల్లావ్యాప్తంగా 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా  గిరిజనేతరులను నియమించవద్దన్న అంశంపై ఇల్లెందు, ఏన్కూరు, బూర్గంపాడు, భద్రాచలం మార్కెట్ కమిటీల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

దీంతో  9 మార్కెట్ కమిటీలకు  పాలకవర్గాలను భర్తీ చేసే అవకాశాలున్నారుు. జిల్లాలోని దేవాలయాలను 6 ఏ, 6 బీ, 6 సీ అని మూడు కేటగిరిలుగా విభజించారు. 6 ఏ పరిధిలో మూడు దేవాలయాలు, 6 బీ లో 2 దేవాలయాలు, 6సీలో 595 దేవాలయాలు ఉన్నాయి. 6ఏ లో ఉన్న భద్రాచలం, జమలాపు రం వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయాలే ఆదాయపరంగా ప్రభుత్వానికి కీలకమైనవి. మిగతావన్నీ ఏడాదికి సగటున తక్కువ ఆదాయం వచ్చేవే. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఇది కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది. మొత్తంగా 9 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఖమ్మం ప్రధానం కాగా, ఆలయాల విషయానికి వస్తే భద్రాచలం ట్రస్ట్‌బోర్డు, గ్రంథాలయ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులు పోటీ పడుతున్నారు.

 ఆదాయం ఉన్న కమిటీలపై దృష్టి..
ఖమ్మం మార్కెట్ కమిటీ భర్తీపైనే అధికార పార్టీలోని ఆశావహులు దృష్టి పెట్టారు. జిల్లాతోపాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి కూడా ఈ మార్కెట్‌లో ఏడాదికి రూ.1500 కోట్లపైనే వ్యాపారం జరుగుతుంది. ఈ కమిటీ చైర్మన్ పదవి కోసం ఉద్యమ జెండాను తొలి నుంచి మోసిన నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు కూడా ఎలాగైనా తమకే చైర్మన్ పదవి దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. మంత్రి తుమ్మలకు అనుంగు అనుచరులుగా ఉన్న నేతలకే ఈ పదవి వరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక నేలకొండపల్లి, కొత్తగూడెం, చర్ల, వైరా, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, మధిర కమిటీలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు సూచించే నేతలా..? లేకపోతే మంత్రి అండదండలున్న వారికే పదవులు దక్కే అవకాశం ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేలు, ప్రధాన నేతలు ఎవరిని సూచించినా మంత్రి తుమ్మల నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని సమాచారం.

తుమ్మలతో సఖ్యత లేని నేతలు ఈ పదవులను దక్కించుకోవాలని నేరుగా తమకున్న మార్గాల్లో ఇతర మంత్రులతో మంత్రాంగం నెరిపేందుకు సమాయత్తమవుతున్నారు. అంతటా తుమ్మల అనుచరులకే పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని గతంలోనే పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితులతో పదవులు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో దీనిపై నేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేసి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న వారికి ఈ పదవిని ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఏడాదికి రూ.25 కోట్లపైనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఆదాయం ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి, పట్టాభిషేకంతోపాటు ఇతర ఉత్సవాలు నిర్వహించడం పాలకవర్గానికి సవాలే. అయితే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలోనూ ఈ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్ పదవితోపాటు సభ్యులు భర్తీకి సంబంధించి ప్రతిష్టాత్మక పోరు నెలకొంటుంది.  చైర్మన్ పదవితోపాటు 9మంది సభ్యులను పాలకమండలికి ఎన్నుకుంటారు. 2013లో ట్రస్ట్‌బోర్డు పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. ఇటీవల ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు అందరూ ఈ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవిపై గురిపెట్టారు.

 రిజర్వేషన్లపై గిరిజనుల ఆశలు..
నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లను కూడా పరిశీలిస్తామని గతంలో సీఎం ప్రకటించడంతో ఏజెన్సీలోని గిరిజన నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇల్లెందు, ఏన్కూరు, బూర్గంపాడు, భద్రాచలం కమిటీల్లో గిరిజనేతరులను నియమించొద్దని కోర్టుల్లో కేసు పెండింగ్‌లో ఉంది. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇక్కడ గిరిజనులను నియమిస్తే ఎలాంటి వివాదం ఉండదని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గిరిజనులకు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇస్తే ఏజెన్సీలో పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే భావనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను పొందేందుకు ఇటీవల జిల్లాలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి చెందిన నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు