పిఠాపురం రాజు కలచెదిరింది

17 Jun, 2017 23:39 IST|Sakshi
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
  • నీరాజనాలు లేవు ... ఆ స్థానంలో అవమానాలే
  • ఆయన రాజ్యంలోనే చుక్కెదురు

అనగనగా అదొక రాజ్యం. మొదట్లో పీఠికాపుర మహా సంస్థానంగా పిలవబడి కాలక్రమంలో పిఠాపురం సంస్థానంగా పేరు మారింది. 1800 నుంచి 1909 వరకు ఈ సంస్థానం కొనసాగింది. సుమారు ఏడెనిమిది మంది రాజులు పాలించారు. పిఠాపురం సంస్థానాధీశులు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజ్యంలో పట్టాభిషిక్తుడైన చివరి రాజు రావు వెంకటకుమారమహీపతి బహదూర్‌. ఆయన 1964లో చనిపోయారు. ప్రజా పాలన వచ్చాక రాచరిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాలక్రమంలో రాజ్యాలు కూడా కనుమరుగైపోయాయి. కానీ ఇప్పటికీ పిఠాపుర రాజ్యంలో రాచరిక పాలనే నడుస్తోందనే  చెబుతారు. పోనీ ప్రస్తుత రాజేమైనా నాటి పిఠాపురం సంస్థానధీశుల వారుసులా అంటే అదీ లేదు. ‘చెట్టు కాయలు చెప్పుకుని’ సామెత చందంగా ఆ రాజుల పాలనతో సరితూగేలా పాలన అందిస్తున్నట్టు గొప్పలకు పోతుండటమే ప్రస్తుత పిఠాపుర రాజ్యంలో జనానికే కాదు రాజు చుట్టూ ఉండే పరివారానికి కూడా నచ్చడం లేదు. 

పిఠాపురం రాజులతో ఏ రకంగాను పోల్చుకోవడానికి కూడా ఇప్పటి రాజు సరిపోరని చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం సంస్థానాన్ని ఏలిన దాదాపు రాజులంతా దళిత జనోద్ధరణ కోసం అహర్నిశలూ శ్రమించారనే చెప్పాలి. తెలుగు నిఘంటువు తయారుచేయించింది, కవులను ప్రోత్సహించింది కూడా వారే. అంతెందుకు వారి యావదాస్తిని విద్యావ్యాప్తి కోసం ఒంటిచేత్తో దానం చేశారు. కోట్ల విలువైన వందలాది ఎకరాలను నిరుపేద కుటుంబాల్లో పిల్లల చదువుల కోసం దానంచేసి చరిత్రలో నిలిచిపోయారు. 
.
భజన బృందం ...
నాటి రాజులతో సమానంగా పాలన అందిస్తున్నామని నేటి తరం రాజు గొప్పగా చెప్పుకుంటుంటారు. రాజ్యంలో పౌరులు భారీ మెజార్టీతో రాజ్యాధికారాన్ని అప్పగించారంటే అదంతా తన గొప్పతనమని నేటి రాజు గుడ్డిగా నమ్ముతారు. నాడు చంద్రవంశ రాజుతో కలిసి వేసిన పాచికపారడంతోనే అధికారం దక్కిందనే వాస్తవాన్ని నేటి రాజు ఎంతమాత్రం విశ్వసించరు. అందుకే అడుగులకు మడుగులొత్తే సామంతులను చేరదీసి అంతఃపురంలో అందలాలు ఎక్కించడం వారు భజనలను ఆలకించడం నేటి రాజుకు పరిపాటిగా మారింది. అదంతా తన గొప్పతనమేనని రాజసం ఉట్టిపడేలా వ్యవహరిస్తారు. మూడేళ్ల పాలనలో రాజ్యంలో పౌరులకు తాను ఎంతో చేశానని తనకు తానుగా గొప్పగా ఆ రాజు భావిస్తున్నారు. అది నిజమా కాదా అని తెలుసుకుని చెవిలో వేయాలని వేగులను పంపించారు. పక్షం రోజులు దేశ సంచారం చేసి వచ్చిన వేగులంతా నిత్యం రాజు వెంట ఉండే భజన బృందమే. రాజ్యంలో చూసి వచ్చిన వాస్తవాలన్నీ రాజు చెవిలో వేస్తే వాస్తవాలంటే గిట్టని ఆ రాజుకు దూరమైపోతామని భయపడ్డారు. అందుకే కాబోలు రాజ్యంలో జనులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని సెలవిచ్చారు. ఇంకేముంది ఎక్కడ అడుగుపెడితే అక్కడ పూలాభిషేకంతో స్వాగతం పలుకుతారనే అత్యాశతో రాజు రాజ్యంలోని 50 పరగణాలను చుట్టి రావాలని అంతఃపురంలో నిర్ణయం తీసుకున్నారు. చైతన్య రథంపై పరివారాన్ని వెంట తీసుకుని మందీ మార్బలంతో బయలుదేరారు.
.
ఛీత్కారాలే...
  రాజు మనసు పొరుగున ఉన్న సామంత రాజ్యంపై పడింది. ఆ రాజ్యంలో ఊరూవాడా తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడకు వెళ్లినా పౌరుల నీరాజనాలకు బదులు ఛీత్కారాలతో చుక్కెదురవుతుండటంతో రాజు కల చెదిరింది. నాటి పీఠికాపుర రాజులు దళితోద్ధరణకు ఎంతో కృషిచేయగా నేటి తరం రాజు ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఖజానాకు వచ్చిన నిధులు సకాంలో ఖర్చుచేయక తిరిగి చంద్రవంశ రాజు ఖజానాకు పోయాయని వెళ్లిన చోటల్లా జనం తిట్ల పురాణం అందుకుంటున్నారు. దాంతో రాజుకు చిర్రెత్తుకు వచ్చినా లెక్క చేయకుండా రాజసం ఉట్టిపడేలా బయలుదేరిన రెండు రోజులకే రాజుకు పౌరులు చుక్కులు చూపించారు. ఆ రాజ్యంలో చినుకు పడితే పాపం పాదచారులకు కూడా కష్టమే. కంపుకొట్టే మురుగు కాలువలు, వెలగని వీధిలైట్లు చూపించి పీఠికాపురం వారసులమని చెప్పుకునే రాజులు చేసే పాలన  ఇదేనా అని అతివలు పిల్లాపాపలతో చుట్టుముట్టేయడంతో రాజు దిక్కులుచూడటం తప్ప ఏమీ చేయలేకున్నారు. వారి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు అనే విషయాన్ని కూడా ఆ క్షణంలో వారు మరిచిపోయారు. సామంత రాజ్యంలోని 11వ పరగణాలో అయితే మహిళలు రాజు రథం వెంటపడి పరుగులుపెట్టించారు. దారి చూపిస్తామని చెప్పి ఏడాదైపోయింది ఇప్పుడు వచ్చి ఏమి చేస్తారనడంతో అసలే రాజు ఆపై కోపం ముచ్చుకొచ్చింది. అయినా ఏమి చేయలేక తమాయించుకున్నారు. మీ పాలనా కాలంలో ఏనాడైనా వచ్చి పట్టించుకున్నారా అని పౌరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో కల చెదిరింది...కథ మారింది..ఇక కన్నీరే మిగిలింది అనే పాట అందుకుని అంతఃపురంలో శయనమందిరం వైపు  అడుగులు వేశారు. 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు