వెబ్‌సైట్‌లో ఖాళీ భూముల వివరాలు

2 Jul, 2017 03:27 IST|Sakshi
వెబ్‌సైట్‌లో ఖాళీ భూముల వివరాలు

సిటీ కన్జర్వెన్స్‌ సమావేశంలో నిర్ణయం
అనుమతించాల్సిందిగా  ప్రభుత్వానికి లేఖ

సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యగా మారిన భూ సంబంధ  వివాదాలను నివారించేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని సిటీ కన్జర్వెన్స్‌ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు  అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. శనివారం ఎంజీబీఎస్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో జరిగిన కన్జర్వెన్స్‌ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్‌ పరిధిలోని కలెక్టరేట్‌లు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు అందే ఫిర్యాదుల్లో భూ సంబందమైనవే ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

 ఆయా భూముల వివరాలు ప్రజలకు తెలియనందునే వివాదాలు నెలకొంటున్నాయని, వీటి నివారణకు భూముల వివరాలు, వాటిపై యాజమాన్య హక్కులు, విస్తీర్ణం తదితర  వివరాలను ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరుతూ  ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు.  నాలాల విస్తరణకు తీవ్ర అడ్డంకిగా ఉన్న 1002 ఆక్రమణలను   తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు తదితర   విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి పునరుద్ధరణ కోసం రికార్డు స్థాయిలో 10వేల ఆస్తులను తొలగించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగరంలోని రహదారులపై గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 వృథా నీటిని రోడ్లపై వదులుతున్నందున రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని, అలాంటి వారిని గుర్తించి జరిమానాలు విధించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని బస్టాండ్‌లు, బస్‌ డిపోలలో స్వచ్ఛత పాటించాలని, స్వచ్ఛ భారత్‌ను సమర్థవంతంగా అమలు చేసే బస్టాండ్‌లు, బస్‌ డిపోలకు ప్రత్యేక పురస్కారాలు అందించాలని ఆర్టీసీ  అధికారులకు  సూచించారు. ఆగస్టు నెలాఖరులోగా  మరో 50 వేల ‘డబుల్‌’  ఇళ్ల నిర్మాణాలకు టెండరు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ హరితహారంలో నగరవాసులకు వారు కోరిన మొక్కలను అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి శాఖ తమ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో వంద శాతం మొక్కలు నాటి వాటి  నిర్వహణ బాధ్యతలను ఉద్యోగులకు అప్పగించాలని సూచించారు.

బస్టాండ్లకు డొమెస్టిక్‌ వాటర్‌ కనెక్షన్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆర్టీసీకి  29 బస్‌డిపోలు, 29 ప్రధాన బస్టాండ్లు ఉన్నాయని, వీటికి డొమెస్టిక్‌ వాటర్‌ కనెక్షన్లు ఇవ్వాలని ఆర్టీసీ ఈడీ  పురుషోత్తం నాయక్‌ జలమండలి అధికారులను కోరారు. ఇమ్లిబన్‌  బస్టాండ్‌కు లీజ్‌ మొత్తాన్ని త్వరితగతిన నిర్ధారించాల్సిందిగా కమిషనర్‌ను కోరారు.  మెట్రో పిల్లర్లలో  ప్రమాదభరితంగా ఉన్నవాటికి రేడియం స్టిక్కర్లు అంటించే ప్రక్రియ చేపట్టామని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.  లక్డీకాపూల్, ప్యారడైజ్‌ జంక్షన్ల వద్ద చిన్న వర్షానికే నీరు నిలుస్తున్నందున సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డ్, మెట్రోరైలు, కంటోన్మెంట్‌ అధికారులు సంయుక్తంగా  అధ్యయనం చేయాలని నిర్ణయించారు.  జంక్షన్ల అభివృద్దిని త్వరిగతిన పూర్తిచేయాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ  రవీందర్‌ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో  రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ రెడ్డి,  హెచ్‌ఎండీఏ,  రోడ్లు–భవనాలు,  విద్యుత్, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు