పథకం ప్రకారమే ప్రతీకార హత్య

8 Sep, 2016 01:15 IST|Sakshi
  • హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్‌  
  • కదిరి టౌన్‌ : తమ సోదరుడ్ని హతమార్చాడనే కక్షతో పథకం ప్రకారం ప్రతీకార హత్య చేశారు.. ఆ ఇద్దరు. చివరికి పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను బుధవారం రాత్రి స్థానిక రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్‌ వెల్లడించారు.
       వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లి సమీపంలోని టీ.వెలమవారిపల్లికి చెందిన రామచంద్రరెడ్డి 2015లో ఉగాది పండుగ సమయంలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన అదే గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని అంతమొందించాలనుకున్నారు.. రామచంద్రసోదరులు. ఇందుకు పథకం రచించారు. వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి హతమారిస్తే రూ.6లక్షల మేర నగదు ఇస్తామని దీంతో గత ఏడాది జూలై 31న అదే గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి, గోవర్ధన్, అతని కుమారుడు లక్ష్మినాయుడు, ప్రభాకర్, నాగేంద్రలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

    అంతా కలిసి వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి ఆటోలో తలుపుల వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో తలుపుల మండలం దాంపల్లి సమీపంలోకి రాగానే ఆటో చెడిపోయినట్లు, మెకానిక్‌ను తీసుకురావాలని తోటి వారిని సూచించినట్లు నాటకమాడారు. అక్కడ పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న మిరపపొడిని చల్లి కట్టెలు, రాళ్లతో వెంకటసుబ్బారెడ్డిని దారుణంగా హతమార్చారు. అప్పట్లో ఈ హత్య తలుపుల మండలంలో సంచలనం రేపింది.


    చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి తమదైన శైలిలో పలు కోణాల్లో విచారణ జరిపి ఎట్టకేలకు బుధవారం నిందితుల్ని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.60వేల నగదుతో పాటు హత్యకు ఉపయోగించిన కట్టెలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిలో ఒక మహిళ కూడా ఉందని సీఐ వివరించారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు. సమావేశంలో తలుపుల ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.   

     

మరిన్ని వార్తలు